నవంబర్ లో రజినీ కొత్త పార్టీ...

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అనేది తమిళనాట ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ టాపిక్కే. దాని మీద ఎప్పుడూ ఆయన సరయిన క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే రజనీ రాజకీయ అరంగేట్రం ఈ ఏడాదిలో చేయబోతున్నట్లు ఆయన సన్నిహితుడు కరాటే తియగ రాజన్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తియగరాజన్ రజనీకి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో చెన్నై నగరానికి డిప్యూటీ మేయర్గా కూడా వ్యవహరించారు. తొలుత మార్చి 12వ తేదీన పార్టీని ప్రారంభిద్దామని రజనీకాంత్ భావించారని.. అయితే అప్పటికే దేశంలో కరోనా టెన్షన్ స్టార్ట్ అయ్యిందని తియగరాజన్ పేర్కొన్నారు.
కరోనా వలన ఈ పార్టీ ప్రారంభ కార్యక్రమం వాయిదా పడిందన్నారు. అయితే అప్పుడు ఆగస్టులో పార్టీని లాంచ్ చేద్దామని అనుకున్నారని కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేశారని పేర్కోన్నారు. నవంబర్లో మాత్రం ఖచ్చితంగా పార్టీ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. రజినీ పార్టీ పేరు ఏవిధంగా ఉండబోతోందనే చర్చ మొదలైంది. అయితే తాను పార్టీ పెట్టినా పార్టీకే పరిమితం అవుతానని ప్రభుత్వంలో తల దూర్చనని రజనీ ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ క్రమంలో రజనీ పార్టీ మీద ఆసక్తి నెలకొంది.