English   

మరో ఏడాది వరకు థియేటర్స్ ఉండవా.. పూర్తి గ్రౌండ్ రిపోర్ట్..

Theaters
2020-07-19 13:53:06

ఇది కరోనా వైరస్ సమయం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చూపించినా అసలుకే మోసం వస్తుంది. పైగా సినిమా ఇండస్ట్రీలో భౌతిక దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎవరికి వారే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తోడు సినిమా షూటింగ్ తో పాటు థియేటర్లో ఓపెనింగ్ కూడా జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికే 4 నెలలుగా థియేటర్లన్నీ మూసేశారు. ఇంకా ఎన్ని నెలలు ఇలాగే మూస్తారో అర్థం కావడం లేదు. మరోవైపు దేశంలో కరోనా కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఒకప్పుడు రోజుకు 10 వేల కేసులు వస్తేనే అయ్యో అనుకునే వాళ్లు.. కానీ ఇప్పుడు 30 వేలు దాటిపోతున్నాయి. జోరు చూస్తుంటే రోజుకు కనీసం 50 వేల మార్క్ కూడా టచ్ అయ్యేలా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చాలా రాస్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ బాట పడుతున్నాయి. ఓపెన్ చేసిన మాల్స్ కూడా తిరిగి క్లోజ్ చేసే ఆలోచనలు చేస్తున్నారు.

అలాంటి సమయంలో థియేటర్స్ ఓపెనింగ్ అనే విషయం కూడా భయం తెప్పిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి థియేటర్ల రీఓపెనింగ్ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. కానీ నిర్మాత సురేష్ బాబు మాత్రం మరోలా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే షూటింగ్ కు అంత అనుకూలంగా లేవు. ఉన్నఫలంగా థియేటర్లు తెరిచినా కూడా ఆడియన్స్ వస్తారో రారో క్లారిటీ లేదు. అందుకే షూటింగ్ మొదలైన రెండు నెలలకు గాని థియేటర్లు తెరవకూడదు అని చెబుతున్నాడు సురేష్ బాబు. రెండు మూడు నెలలు షూటింగ్ చేసుకున్న తర్వాత చాలా సినిమాలు విడుదలకు వస్తాయి.. అప్పటికి కరోనా వైరస్ కూడా మన అదృష్టం బాగుంటే కాస్త కంట్రోల్ అవుతుంది. అలాంటి సమయంలో థియేటర్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాడు సురేష్ బాబు.

మరోవైపు బాలీవుడ్ లెజెండరీ దర్శకుడు శేఖర్ కపూర్ అయితే మరోలా ఆలోచిస్తున్నాడు. ఈయన ఏకంగా మరో ఏడాది వరకు కూడా థియేటర్స్ తెరుచుకోవని జోష్యం చెప్తున్నాడు. అప్పటి వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయి. సినిమాలు కూడా రావు.. ఓటిటిలో వస్తే స్టార్స్ వ్యాల్యూ ఉండదని చెప్పాడు. ఇన్ని రోజులు థియేటర్స్ మూసి ఉంచితే కచ్చితంగా స్టార్ హీరోల మార్కెట్ పై దారుణంగా ప్రభావం పడుతుందని నిర్మాతలు కూడా భయపడుతున్నారు. అలాకాకుండా తొందరపడి సెప్టెంబరులో థియేటర్లు ఓపెన్ చేస్తే జనం రాకపోతే అసలుకే మోసం వస్తుంది.. ఇప్పటికే ఉన్న నష్టాలు చాలవన్నట్లు ఎగ్జిబిటర్లపై మరింత భారం పడుతుంది అంటున్నాడు ఈ నిర్మాత.

ఎటు చూసుకున్న కూడా షూటింగ్స్ మొదలైన రెండు నెలలకు థియేటర్ లో ఓపెన్ చేస్తే అంతా బాగుంటుందని ప్రభుత్వానికి కూడా తన సూచనగా చెబుతున్నాడు సురేష్ బాబు. ఈ లెక్కన చూసుకున్నా మరో ఆర్నెళ్ల వరకు షూటింగ్స్ అసలు మొదలయ్యేలా కూడా కనిపించడం లేదు. మహేష్ బాబు సహా చాలా మంది స్టార్ హీరోలు డిసెంబర్ వరకు అసలు షూటింగ్ కు రామని తెగేసి చెప్తున్నారు. కరోనా కంట్రోల్ అయిన తర్వాత కానీ బయటికి అడుగు పెట్టేది లేదని చెప్తున్నారు వాళ్లు. ఇలాంటి సమయంలో సినిమాలు లేకపోయినా థియేటర్స్ ఓపెన్ చేస్తే వేస్ట్.. ఎన్నో సినిమాలు విడుదలకు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియన్స్ థియేటర్స్ వరకు వస్తారా అనేది కూడా అనుమానమే. అందుకే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అనే మాటే వద్దని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఈ పరిస్థితులు చూస్తుంటే మరో ఏడాది వరకు కూడా థియేటర్స్ అనేవి ఓపెన్ కానట్లే అని తెలుస్తుంది. 

More Related Stories