చిరంజీవితో మెహర్ రమేష్.. అసలు కథ ఇదే..

మెహర్ రమేష్.. ఈ పేరు గుర్తుందా..? మరిచిపోయేంత చిన్న పేరేం కాదులెండి. ఎందుకంటే తెలుగులో ఎక్కువగా నష్టాలు తీసుకొచ్చిన దర్శకుడిగా మనోడికి మంచి పేరుంది. చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. ఏ ఒక్కటి కూడా నిర్మాతలకు లాభాలు తీసుకురాలేదు. దాంతో భారీ సినిమాల దారుణమైన దర్శకుడు అంటూ మెహర్ ను సెటైరికల్ గానూ పిలుస్తుంటారు. కంత్రి.. బిల్లా.. శక్తి.. షాడో.. ఇలా ఒకదాన్ని మించి మరో సినిమా ఇచ్చాడు మెహర్ రమేష్. అదేం చిత్రమో కానీ కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈ దర్శకుడికి తెలుగు మాత్రం కలిసిరాలేదు. ఇక్కడ ఫ్లాప్ అయినా ఆంధ్రావాలాను కన్నడలో బ్లాక్ బస్టర్ చేసాడు మెహర్. తెలుగులో మాత్రం మనోడికి జాతకం తిరగబడింది. షాడో వచ్చి ఆరేళ్లైనా ఇప్పటి వరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు మెహర్. ఇప్పుడు ఈయన దర్శకుడిగా రిటైర్ అయిపోయినట్లే.
సింపుల్ గా మెగా కుటుంబతో కలిసిపోయాడు ఈ దర్శకుడు. అక్కడే కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఎలాగూ మెగా కుటుంబానికి బంధువే కాబట్టి వాళ్లు కూడా మెహర్ ను అక్కడే ఉంచేసి అవకాశాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు..? ఎక్కడ ఉన్నాడు..? ఎవరి సినిమాలకు పని చేస్తున్నాడు..? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే. కానీ మెహర్ మాత్రం మెగా సినిమాలతో పాటు ఇండస్ట్రీలో మరికొన్ని భారీ సినిమాలకు అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు. మనోడు యాక్షన్ సీన్స్ తెరకెక్కించడంలో తోపు. అందుకే కొన్ని భారీ సినిమాలకు ఈయన్నే అసిస్టెంట్ గా తీసుకుని దర్శకులు ఈయనకు అప్పగించేస్తున్నారు.
మొత్తం సినిమా హ్యాండిల్ చేయకపోయినా యాక్షన్ సీన్స్ మాత్రం బాగా చేస్తాడని బిల్లా.. శక్తి లాంటి సినిమాలే నిరూపించాయి. దానికితోడు గీతాఆర్ట్స్ లో సలహాదారుగా ఉన్నాడు. మొత్తానికి దర్శకుడిగా ఉన్నపుడు పడిన టెన్షన్ ఇప్పుడు మెహర్ లో కనిపించడం లేదు. కూల్ గా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈయన చిరంజీవికి కథ చెప్పి ఒప్పించడం సంచలనంగా మారింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇక్కడ రామ్ చరణ్ నిర్మాణంలో ఓటిటి కోసం ఓ చిన్న సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు మెహర్ రమేష్. దీన్ని ఆహాలో విడుదల చేయనున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే అప్పుడు చిరంజీవితో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. లేకపోతే చిరుతో మెహర్ రమేష్ సినిమా చూసే అవకాశమే ఉండదు.