బాలయ్య, బోయపాటితో పెట్టుకుంటే డేంజర్కే డేంజర్..

అదేంటి బాలయ్య, బోయపాటితో పెట్టుకుంటే డేంజర్ ఏంటి.. కొంపదీసి కరోనాను కూడా పట్టించుకోకుండా షూటింగ్కు వెళ్తున్నారా ఏంటి అనుకుంటున్నారా.. అలాంటిదేం లేదు కానీ నిజంగానే ఇప్పుడు బాలయ్య, బోయపాటితో పెట్టుకుంటే మాత్రం డేంజర్ అనుకోక తప్పదు. బాలయ్యకు కొందరు దర్శకులతో భలే సింక్ అవుతుంది. వాళ్ల కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కూడా సంచలనాలు సృష్టిస్తాయి. ఒకప్పుడు కోడి రామకృష్ణ.. ఆ తర్వాత బి గోపాల్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసాడు బాలయ్య. ఓ రకంగా ఆయన కెరీర్ ను పీక్స్ కు తీసుకెళ్లిన దర్శకులు వాళ్లే. ఆ రేంజ్ లో బాలయ్యతో మాయ చేస్తున్న ఈ తరం దర్శకుడు బోయపాటి శీను. మిగిలిన దర్శకులంతా ఫ్లాపులిస్తున్న సమయంలో సింహా సినిమా చేసి బాలయ్య కెరీర్ కు ఊపిరి ఊదాడు బోయపాటి. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని లెజెండ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మూడోసారి కూడా బాలయ్యతో సినిమాకు సిద్ధమవుతున్నాడు బోయపాటి శీను.
వినయ విధేయ రామ ఫ్లాప్ కావడంతో బోయపాటికి ఏడాదికి పైగానే గ్యాప్ వచ్చింది. ఇన్నాళ్లకు బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే కరోనా రావడంతో నిలిపేసారు. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు బాలయ్య సహ నిర్మాతగా ఉన్నాడని తెలుస్తుంది. దీనికోసం రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్లో షేర్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కూడా సింహా, లెజెండ్ సినిమాల్లో మాదిరే ఇప్పుడు కూడా డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. కవలల మధ్య జరిగే సస్పెన్స్ డ్రామా ఇది అని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారనే ప్రచారం జరిగినా కూడా ఇప్పుడు మాత్రం డేంజర్ అనేది ప్రచారంలోకి వచ్చింది. కథకు ఈ టైటిల్ అయితే బాగా సరిపోతుందని భావిస్తున్నాడు బోయపాటి శ్రీను. ఇప్పటికే డేంజర్ పేరుతో కృష్ణవంశీ సినిమా చేసాడు అయినా కూడా పదేళ్లు దాటిపోవడంతో ఆ టైటిల్ మరో సినిమాకు పెట్టుకోవచ్చు. అలా ఇప్పుడు బోయపాటి, బాలయ్య డేంజర్ అయిపోతున్నారు.