జేజమ్మగా మారుతోన్న దీపికా పడుకోణె

దాదాపు పదేళ్ళ క్రితం సంక్రాంతి కానుకగా స్వీటీ అనుష్క కథానాయికగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన సినిమా 'అరుంధతి'. హారర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అరుంధతి-జేజమ్మగా అనుష్క, పశుపతి పాత్రని సోనూసూద్ పోషించారు. ఆరోజుల్లోనే అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా టాప్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ హారర్ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్నట్టు చెబుతున్నారు. కానీ అదే నిర్మాణ సంస్థ నుండి మాత్రం కాదు. ఇక ఈ రీమేక్ బాలీవుడ్ లో కానుండగా మధు మంతెన తో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అల్లు అరవింద్ ఫ్యాన్సీ రేటుకి హిందీ రీమేక్ హక్కులు దక్కించుకున్నారట.
మధు మంతెనతో కలిసి అల్లు అరవింద్ హిందీలో చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తుంది. హిందీలో అనుష్క పాత్రలో దీపికా పదుకొణే నటించనుందని టాక్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. కాగా, దీపికా పదుకొణే ప్రభాస్ 21వ చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అవుతున్న సంగతి విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన కొందరు స్టార్ నటీనటులు కూడా నటిస్తున్నారట. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్, గ్రాఫిక్స్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో ప్రీ విజువలైజేషన్ గ్రాఫికల్ వర్క్స్ జరుగుతోందని చెబుతున్నారు.