ఆ గ్యాంగ్ అంటూ సంచలన కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో నెపోటిజం గురించి భారీ చర్చ నడుస్తోంది. ఆయన మరణం తరువాత చాలా మంది మందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేశారు. అందులో భాగంగానే సంగీత పరిశ్రమ కూడా ఓ మాఫియా గుప్పిట్లో చిక్కుకుందంటూ సోనూ నిగంలాంటి ప్రముఖ గాయకులు కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనకు సంబంధించిన కొన్ని పుకార్లు ఇండస్ట్రీలో వ్యాపించాయని, దీని వెనక ఒక గ్యాంగ్ ఉందని ఆయన ఆరోపించారు. రేడియో మిర్చి ఆర్జే సురేన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
బాలీవుడ్ సినిమాలకు సంగీతాన్ని ఎక్కువగా ఎందుకు కంపోజ్ చేయలేదని అడిగినపుడు పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. తాను మంచి సినిమాలకు ఎపుడూ నో చెప్పలేదని, కానీ ఒక ముఠా తనపై పుకార్లను వ్యాప్తి చేస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలానే కొన్ని సినిమాలు తన వరకు రాకుండా కుట్ర చేస్తున్నారనీ, సమయానికి స్వరాలు ఇవ్వరనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని రెహమాన్ ఆరోపించారు. అయినా ఫర్వాలేదన్న ఆయన తాను విధిని నమ్ముతానని అలాగే ప్రతిదీ ఆ దేవుడి దగ్గరనుంచే వస్తుందని నమ్ముతాను కాబట్టి నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను చేస్తున్నానని చెప్పుకొచ్చారు.