జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ కు పెరుగుతున్న క్రేజ్..

ఎవరి భాషలో ఉన్న హీరోలకు వాళ్ల దగ్గర అభిమానులుండటం కామన్. కానీ కొందరు హీరోలకు కొన్ని ఏరియాల్లో ఫ్యాన్స్ ఎందుకు ఉంటారో.. వాళ్లకు అంతగా వాళ్లు ఎందుకు కనెక్ట్ అవుతారో తెలియదు. ఉదాహరణకు రజినీకాంత్ నే తీసుకోండి. ఈయనకు ఇండస్ట్రీతో పనిలేదు.. అన్నిచోట్లా సూపర్ స్టార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లో. బాలీవుడ్ హీరోలను కూడా అక్కడ గుర్తు పడతారో లేదో తెలియదు గానీ రజినీ ఫోటో చూపిస్తే మాత్రం జపనీయులు ఫిదా అయిపోతారు. అలాగే బన్నీని చూస్తే మళయాలీలు మనసు పారేసుకుంటారు. అచ్చంగా అలాగే ఇప్పుడు జపాన్ లో రజినీ తర్వాత ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు పడిపోయారో తెలియదు గానీ జపాన్ లో మాత్రం జూనియర్ సినిమాలకు బాగా గిరాకీ ఉంది. అక్కడ టీవీ షోల్లో ఎన్టీఆర్ పాటలకు డాన్సులు చేయడం.. ఎన్టీఆర్ పై స్పెషల్ డాక్యుమెంటరీలు సిద్ధం చేయడం కూడా జరిగిపోయాయి.
కొన్నేళ్లుగా ఎన్టీఆర్ ప్రతి సినిమా జపాన్ లో విడుదలవుతోంది. ఆ మధ్య జనతా గ్యారేజ్ కూడా జపాన్ లో విడుదలైంది. స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పాటలను అక్కడ ఒక జంట బాగా హైలెట్ చేస్తుంది. ఎన్టీఆర్ పాటలకు కవర్ సాంగ్స్ చేస్తున్నారు ఓ అన్నా చెల్లెలు. మునీరు, ఆషాహి అనే ఇద్దరు జపనీస్ అన్నా చెల్లెళ్లు జూనియర్ ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరూ అశోక్ సినిమాలోని గోల గోల పాట కవర్ సాంగ్ చేశారు. ఇప్పుడు సింహాద్రి సినిమాలోని చీమ చీమ పాటను కూడా ఇలాగే కవర్ సాంగ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో పెరుగుతున్న ఫాలోయింగ్ చూసి అభిమానులు కూడా సంతోష పడుతున్నారు.