ఆస్కార్ అవార్డు... శాపమే నంటూ వెలుగెత్తిన మరో గ్రహీత

బాలీవుడ్ లోని ఓ గ్యాంగ్ తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ తనకు అవకాశాలు రాకుండా చేస్తుందని ఆస్కార్ గ్రహీత, ఏఆర్ రెహమాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇండియాకి చెందిన మరో ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పోకుట్టి కూడా రహమాన్‌కు గొంతు కలిపారు. ఆస్కార్ గెలుచుకున్న తర్వాత తనకు స్థానికంగా సినిమా అవకాశాలే కరువయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినీనటులు, సినీసాంకేతిక నిపుణులు సాధించాలని కలలు కనే అవార్డు ఆస్కార్ అని కానీ ఈ అవార్డు రావడంతో పలువురు శాపంగా భావిస్తారని రసూల్ తెలిపారు.
ఈ శాప ప్రభావానికి అందరూ గురౌతారని... తానూ వారిలో ఒకడినేనని ఆయన అన్నారు. రెహమాన్ ఆస్కార్ పొందిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకి అత్యుత్తమ సౌండ్ మిక్సింగ్ అందించినందుకు గాను ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు. తాజగా ఆస్కార్‌ను గెల్చుకోవటమే రెహమాన్ చేసిన తప్పు అని ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ కలకలం రేపగా దానికి రసూల్ స్పందింస్తూ ‘‘డియర్ శేఖర్ కపూర్, దీని గురించి నన్నడగండి. ఆస్కార్ గెలుచుకున్న తర్వాత నాకు హిందీ చిత్రాలే కాకుండా స్థానిక చిత్రాల్లో కూడా అవకాశాలు కరువయ్యాయి. నేను తమకు అవసరం లేదని నా ముఖం మీదే చెప్పిన నిర్మాణ సంస్థలున్నాయి. అయినా నాకు సినీ పరిశ్రమ అంటే ప్రేమే...’’ అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.