ప్రముఖ నటుడు రావి కొండలరావు కన్నుమూత..

2020-07-29 00:57:39
ప్రముఖ తెలుగు సినీ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత రావి కొండలరావు కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 1932, ఫిబ్రవరి 11న శ్రీకాకుళంలో జన్మించారు ఈయన. దాదాపు 60 ఏళ్లుగా ఈయన తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నారు. నటుడిగా మొదలై.. రచయితగా ఆ తర్వాత ఎన్నో పాత్రల్లో తెలుగు వాళ్లను మెప్పించారు ఈయన. తెలుగులోనే దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు రావి కొండలరావు. తేనె మనసులు, దసరా బుల్లోడు, రంగూన్రౌడి, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, రాధాగోపాలం, కింగ్, ఓయ్, వరుడు తదితర చిత్రాల్లో రావి కొండలరావు నటించారు. ఆయన భార్య రాధా కుమారి కూడా నటి. ఈమె 2012లో మరణించారు. ఇద్దరూ భార్యా భర్తలుగా దాదాపు 150 సినిమాల్లో నటించారు. రావి కొండలరావు మృతిపై తెలుగు సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.