English   

చంద్రముఖికి సీక్వెల్...లారెన్స్ తో కియారా 

Kiara Advani
2020-07-29 17:39:03

విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ కొట్టిన సినిమాల లిస్ట్ లో చంద్రముఖి ఒకటిగా కనిపిస్తుంది. ఎప్పుడో మలయాళంలో 'మణిచిత్రతాళు' పేరుతో తెరకెక్కిన సినిమా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మలయాళీ సినిమా వచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత ఆ సినిమా కన్నడలో రీమేక్ అయ్యింది.  ఆ సినిమా కూడా విజయం సాధించే సరికి రజనీకాంత్ దానిపై దృష్టి నిలిపాడు. ఆ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేశాడు. 2005లో పి.వాసు దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార నటించిన ‘చంద్రముఖి’ మంచి విజయం సాధించింది. 

తమిళ, తెలుగు భాషల్లో కూడా ఆ సినిమా అంతే సంచలన విజయం సాధించింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది. తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా వెంకటేశ్ హీరోగా 'నాగవల్లి' పేరుతో తెలుగులో ఓ చిత్రాన్ని చేసినప్పటికీ, అది అంతగా ఆడలేదు. ఈ సినిమాని అప్పట్లోనే అక్షయ్ కుమార్ హీరోగా .. 'భూల్ భులయ్య' పేరుతో హిందీలోకి ఈ సినిమాను ప్రియదర్శన్ రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా బాగానే ఆడింది. మళ్లీ ఇంతకాలానికి హిందీలో ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని చెబుతున్నారు. ఆ రెండో పార్ట్‌కు కూడా పి. వాసు దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు.  

More Related Stories