కరోనాతో కన్నుమూసిన అక్షర హాసన్ మేకప్ మెన్..

కరోనా వైరస్ ప్రస్తుతం భారత దేశాన్ని పట్టి పీడిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు చూసి ప్రజల్లో భయాందోళనలు కూడా పెరిగిపోతున్నాయి. అడుగు బయట పెట్టాలంటే కరోనా వైరస్ ఎక్కడ కాటేస్తుందో అని వణికిపోతున్నారు జనం. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ పర్సనల్ మేకప్ మేన్ కోవిడ్ -19తో మరణించాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అక్షర హాసన్. 2015లో ఆర్. బాల్కీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ధనుష్ హీరోలుగా తెరకెక్కిన 'షమితాబ్' చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన అక్షర.. అజిత్ హీరోగా తెరకెక్కిన 'వివేగం', విక్రమ్ హీరోగా వచ్చిన మిస్టర్ కేకే సినిమాల్లో నటించింది.
అప్పటి నుంచి ఆమెకు సచిన్ దాదా పర్సనల్ మేకప్ మేన్‌గా పని చేస్తున్నాడు. ఈయన కొన్ని రోజుల కింద కరోనా బారిన పడ్డాడు. కొన్నాళ్లుగా ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకుంటున్న సచిన్ పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. ఆయన మరణం తనతో పాటు తన కుటుంబ సభ్యులను ఎంతగానో కలిచి వేసిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అక్షర. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడం తనకు వ్యక్తిగతంగా ఎంతో బాధ కలిగించిందని తెలిపింది. ఆయన కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటారని అక్షర హాసన్ ప్రకటించింది.