English   

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన జెర్సీ

Jersey
2020-08-01 10:43:52

తెలుగు సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. బాహుబలి తర్వాత మన సినిమాలు అన్ని దేశాల్లో ప్రాచూర్యం పొందుతున్నాయి. తాజాగా భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు  'జెర్సీ' చిత్రం ఎంపికైంది. నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ` తెలుగునాట విజయం సాధించటమే కాకుండా పలు ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. సంగీత దర్శకుడు అనిరుద్ 'జెర్సీ' విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం దర్శకత్వం ఈ చిత్రానికి మరో ఆకర్షణ గా నిలిచింది. 

పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు... జీవితంలో అతను ఓడి గెలిచిన తీరు హృద్యంగా ఈ 'జెర్సీ' సినిమాలో చూపించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు 'జెర్సీ' ఎంపికవటం నిజంగానే అభినందనీయం. ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శన జరుగుతుంది. ఈ విషయాన్ని మీడియాతో పంచుకోవటం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపాడు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరో 'షాహిద్ కపూర్' తో ఈ 'జెర్సీ' చిత్రం బాలీవుడ్ లో నిర్మితం కానున్న విషయం విదితమే. దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను అక్కడ నిర్మిస్తున్నారు. 
 

More Related Stories