English   

విశాఖ రాజధానికి టాలీవుడ్ సై.. ఇండస్ట్రీ మార్చేస్తున్నారా..

Tollywood
2020-08-06 17:37:24

తెలుగు ఇండ‌స్ట్రీ అంటే కేరాఫ్ హైద‌రాబాద్. ఒక‌ప్పుడు చెన్నైలో ఉన్న ఇండ‌స్ట్రీని హైద‌రాబాద్ కు తీసుకురావ‌డానికి చాలా క‌ష్టాలు ప‌డ్డారు మ‌న పాత న‌టులు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గ‌జాలు తెలుగు ఇండ‌స్ట్రీని భాగ్య‌న‌గ‌రానికి త‌ర‌లించ‌డానికి చాలా శ్ర‌మ ప‌డ్డారు. ఏఎన్నార్ స్టూడియోలు నిర్మించి ఇండ‌స్ట్రీని హైద‌రాబాద్ కు మార్చ‌డానికి కృషి చేస్తే.. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు ఇండ‌స్ట్రీకి బాగా హెల్ప్ అయ్యాయి. ఇక ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి. తెలుగు రాష్ట్రంగా ఉన్న‌ది.. రాష్ట్రాలుగా మారిపోయాయి. ఇలాంటి టైమ్ లో మరోసారి ఇండ‌స్ట్రీని త‌ర‌లించే ప‌నులు జోరందుకున్నాయనే ప్ర‌చారం జ‌రుగుతుంది. పైగా ఇప్పుడు టాలీవుడ్ పెద్దలు విశాఖ రాజధానికి సై అంటున్నారు. జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయంపై కూడా చాలామంది సానుకూల అభిప్రాయం వెల్లడించారు.

ఇవన్నీ చూస్తుంటే ఇండస్ట్రీ మార్పుకు కూడా శ్రీకారం చుడుతున్నారనేది వార్తలు వినిపిస్తున్నాయి. పైగా రామానాయుడు స్టూడియోస్ కూడా ఇక్కడ అమ్మేసాడు సురేష్ బాబు. మిగిలిన నిర్మాతలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీకి చిరునామాగా ఉన్న హైద‌రాబాద్ ను ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆడియో వేడుక‌లు, స‌క్సెస్ ఫంక్ష‌న్ లు అన్నీ ఏపీలో చేసుకుంటున్నారు కొంద‌రు హీరోలు. పైగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ కూడా సినిమా ఇండ‌స్ట్రీని వైజాగ్ లో అభివృద్ది చేస్తానంటూ వాగ్ధానాలు చేస్తున్నారు. సినిమా వాళ్లు అడిగినవన్నీ కాదనకుండా ఇస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు కూడా జగన్ ను ప్రత్యేకంగా వెళ్లి కలిసి వచ్చారు. ఇప్పుడు మళ్లీ కలుస్తామంటున్నారు. ఈ విషయంలో జగన్ కూడా వాళ్లకు కొన్ని ప్రామిస్ లు చేస్తున్నాడని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా షూటింగ్స్ విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అని జగన్ ప్రత్యేకంగా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విశాఖపట్నం రాజధాని అయితే ఫ్లైట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇది కూడా ఆలోచిస్తున్నారు సినీ పెద్దలు.

ఇక్క‌డ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం తెలుగు ఇండ‌స్ట్రీని నెత్తిన పెట్టుకుంటున్నాడు. అడిగిన‌వ‌న్నీ ఇచ్చి ప్రోత్స‌హిస్తున్నాడు. ఈ మ‌ధ్య చాలా వేడుక‌లు ఏపీలోనే జ‌రిగాయి.. జరుగుతున్నాయి కూడా. ఒకటి ఇక్కడ జరిగితే మరొకటి అక్కడ చేస్తూ ఇద్దరు అభిమానులను సంతృప్తి పరుస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇండ‌స్ట్రీని మార్చేయాల‌నే ఆలోచ‌న ఉందో లేదో తెలియ‌దు కానీ మ‌న హీరోలు సైతం టాలీవుడ్ ని ఏపీకి బాగానే స‌పోర్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ వెంక‌టేశ్ లాంటి హీరోలు స్టూడియోల నిర్మాణం.. ప్ర‌భాస్, మ‌హేశ్ లాంటి హీరోలు మ‌ల్టీప్లెక్స్ ల నిర్మాణం చేప‌ట్టారు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్, బాల‌కృష్ణ లాంటి స్టార్ హీరోలు కూడా ఏపీలో స్టూడియోలు క‌ట్ట‌డానికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా సినిమా ఇండస్ట్రీ కోసం నిధులు కూడా కేటాయిస్తానని చెబుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే తెలుగు ఇండ‌స్ట్రీని కేరాఫ్ విశాఖ చేసే వ‌ర‌కు మ‌న హీరోలు నిద్ర పోయేలా క‌నిపించ‌ట్లేదు. కానీ ఇండ‌స్ట్రీని త‌ర‌లించ‌డం అంత ఈజీనా..? చెన్నై నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఏళ్లకేళ్లు కష్టపడితే కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్న సమయంలో మరోసారి ఇండస్ట్రీ మార్పు అంటే చిన్న విషయం కాదు. మరి దీనిపై సినిమా పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలిక.
 

More Related Stories