English   

పాపం.. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిన జయప్రకాష్ రెడ్డి..

 Jaya prakash reddy
2020-09-08 18:09:53

సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అత్యంత అరుదైన నటుల్లో ఆయన కూడా ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తారు. అలాంటి నటుడు అర్ధాంతరంగా వెళ్ళి పోవడం ఇండస్ట్రీకి తీరని లోటు. 74 ఏళ్ల జీవితం.. 32 ఏళ్ల సినిమా ప్రయాణం.. ఈ ప్రస్థానంలో ఆయన ఎన్నో విజయాలు అందుకున్నారు. అయితే ఎన్ని సాధించినా కూడా ఒక్క కోరిక మాత్రం ఆయనకు అలాగే ఉండిపోయింది. చివరికి అది తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. అదేంటంటే ఆయన హీరోగా నటించిన సినిమా విడుదల కాకపోవడం. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా అలెగ్జాండర్ అనే సినిమా తెరకెక్కింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో ఎంతో విలక్షణమైన పాత్రలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. 

ఈయన హీరోగా అలెగ్జాండర్ సినిమాను రూపొందించాడు దర్శకుడు ధవళ సత్యం. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో ఆయన ఒక్కరే  నటించడం విశేషం. అలెగ్జాండర్ షూటింగ్ పూర్తయింది. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై జయప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల కాలేదు. డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల చేయడానికి ఆయన చాలా ప్రయత్నించారు. తన సినిమాను ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది అంటూ ఆయన మీడియా ముందుకు వచ్చి అభ్యర్థించారు కూడా. అయినా కూడా ఈ సినిమా బయటికి రాలేదు. ఈ కోరిక తీరకుండానే ఆయన చనిపోవడం అందరినీ కలిచివేసింది. మరి కనీసం ఇప్పుడైనా అలెగ్జాండర్ సినిమా విడుదల అవుతుందో లేదో..
 

More Related Stories