లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్..

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్న దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. మాయాబజార్ సమయం నుంచి ఈయన ఇండస్ట్రీలోనే ఉన్నాడు. ఆ సినిమాకు అసిస్టెంట్ గా పని చేసాడు సింగీతం. ఆ తర్వాత 15 ఏళ్లకు దర్శకుడు అయ్యాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు అలుపెరుగని యోధుడిగా పని చేస్తూనే ఉన్నాడు ఈయన. ఇదిలా ఉంటే సింగీతం శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయం తానే స్వయంగా అభిమానులకు తెలియచేసాడు. సెప్టెంబర్ 21న ఈయన పుట్టిన రోజు ఉండటంతో అభిమానులు ఎవరూ తనను కలవొద్దని సూచించాడు. సెప్టెంబర్ 9న తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు సింగీతం. ఈ విషయాన్ని కూడా ఆయన సరదగానే తీసుకున్నారు. గత 65 ఏళ్లుగా తాను పాజిటివ్‌గానే ఉన్నానని.. ఇప్పుడు కొత్తగా తనకు పాజిటివ్ ఏంటి అంటూ కామెడీ చేసాడు ఈయన. ఏదేమైనా కూడా తనకు కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని.. సపరేట్ బాత్రూమ్, రూమ్ అన్నీ పక్కాగా ఉన్నాయని తెలిపాడు సింగీతం. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. మరో 15 రోజులు ఇంట్లోనే ఉండాలని చెప్పాడు. అందుకే తన పుట్టిన రోజున ఎవరూ కలవడానికి ప్రయత్నించొద్దని తెలిపాడు సింగీతం. ఈయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.