English   

ఏడేళ్ల తర్వాత పర్ఫెక్ట్ రీ ఎంట్రీ ఇస్తున్న సిద్దార్థ్..

Siddharth
2020-09-18 12:47:37

పేరుకు తమిళ హీరో అయినా కూడా తెలుగులో అద్భుతమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్. ఒకప్పుడు తెలుగు హీరోలకు పోటీగా సంచలన విజయాలు అందుకొన్నాడు. బాయ్స్ అనే డబ్బింగ్ సినిమాతో పరిచయమైన సిద్ధూ.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆ తర్వాత వెంటనే బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో స్టార్ హీరో అయిపోయాడు. కానీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేక రేసులో పూర్తిగా వెనుకబడిపోయాడు. సిద్ధార్థ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలు పరవాలేదనిపించినా కూడా సిద్ధార్థకు మునుపటి ఇమేజ్ మాత్రం తీసుకురాలేదు. భారీ అంచనాలతో దిల్ రాజు నిర్మించిన ఓ మై ఫ్రెండ్ కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఈయన తెలుగులో సినిమాలు చేయలేదు. రెండేళ్ల కింద గృహం అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు సిద్ధూ. ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ఈయన. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన రెండో సినిమా కోసం సిద్ధార్థను తీసుకున్నాడు. మహా సముద్రం టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. ఇందులో చాలా మంది హీరోల పేర్లు వినిపించినా కూడా చివరికి శర్వానంద్, సిద్ధార్థ్ కన్ఫర్మ్ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా నిర్మించిన అనిల్ సుంకర దీనికి నిర్మాత. మొత్తానికి మహాసముద్రం సినిమాతో సిద్దు రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. 

More Related Stories