ఎస్పీ బాలు ఆరోగ్యం అత్యంత విషమం.. హెల్త్ బులెటన్ విడుదల..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మళ్లీ విషమించింది. ఈయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటన్లో ఎక్స్ట్రీమ్ క్రిటికల్ అనే పదం పెట్టారు. దాంతో బాలు ఆరోగ్యం ఎలా ఉందో అర్థం అయిపోతుంది. కరోనా బారిన పడి గత 40 రోజులుగా చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. విదేశీ వైద్య బృందం కూడా ఆయన కోసం పని చేస్తున్నారు. అత్యంత విషమ స్థితి నుంచి కోలుకుంటూ వచ్చాడు బాలు.
ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపాడు తనయుడు చరణ్. పైగా నెల రోజుల తర్వాత చేసిన పరీక్షలో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపాడు ఎస్పీ చరణ్. అయితే ఇక్కడ విషయం కరోనా కాదని.. ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. అది త్వరగా తగ్గిపోతే ఆయన ఆరోగ్యం మరింత బాగుపడుతుందని చెప్పాడు చరణ్. ఈ వారంలోనే వెంటిలేటర్ కూడా తీస్తారని తాము అనుకున్నామని.. కానీ అది కుదర్లేదని చెప్పాడు ఈయన.
ఇప్పటికే ఆయన వేగంగా కోలుకుంటున్నారని.. వీకెండ్లో చిన్న పార్టీ కూడా చేసుకున్నామని చెప్పాడు చరణ్. అమ్మానాన్న వివాహ వార్షికోత్సవం హాస్పిటల్లోనే చేసామని చెప్పాడు ఈయన. వెంటిలేటర్‌పైనే ఉన్నా కూడా ఆయనకు ఇష్టమైన క్రికెట్, టెన్నిస్ చూస్తున్నాడని.. ఐపిఎల్ కోసం వేచి చూస్తున్నాడని తెలిపాడు చరణ్.
ఇన్ని చెప్పిన తర్వాత సెప్టెంబర్ 23 రాత్రి నుంచి మళ్లీ ఈయన పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఈయన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈయన ప్రాణాలు కాపాడటం కోసం వైద్య బృందం పని చేస్తుంది. ఆయన మళ్లీ తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు అభిమానులు.