English   

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత..

 SP Balasubrahmanyam Dies
2020-09-25 13:33:51

సంగీత ప్రపంచపు రారాజు మనందరినీ కాదని మరో ప్రపంచానికి వెళ్లిపోయాడు. శ్రోతలను ఒంటరి చేసి.. సంగీత సామ్రాజ్యపు సింహాసనాన్ని అనాథను చేసి ఆయన మాత్రం తన దారి తాను చూసుకున్నాడు. కోట్లాది సంగీత హృదయాలను శోక సంద్రంలో ముంచేస్తూ ఎస్పీ బాలసుబ్రమణ్యం కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. గత 43 రోజులుగా చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూసాడు. గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఈయన సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసారు. గత 43 రోజులుగా ఈయన చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పరిస్థితి విషమించడంతో ఈయన సెప్టెంబర్ న మరణించారు. ఈయన మృతి ఇండస్ట్రీని శోక సంద్రంలో నింపేసింది. 1946, జూన్ 4 న నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం రెండో కుమారుడు. బాల్యం నుంచే బాలుకు పాటలు పాడటం అనేది అలవాటుగా ఉండేది. ఆ తర్వాత అదే ఆయన్ని లెజెండ్‌గా మార్చేసింది. 

తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయంతో మద్రాసులో AMIE కోర్సులో చేరాడు. ఆ సమయంలోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు బాలు. చదువుకునే రోజుల్లోనూ.. ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని.. ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు. కానీ కాలం మాత్రం ఈయన్ని గాయకుడిగా మార్చేసింది. తెలుగు, తమిళ, హిందీ, ఒరియా, కన్నడ, మలయాళ ఇలా అన్ని భాషల్లో కలిపి 40 వేలకు పైగా పాటలు పాడాడు బాలు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. కోదండపాణి ఈయనకు అవకాశం ఇచ్చిన మొదటి సంగీత దర్శకుడు. ఆ తర్వాత భారతదేశంలోని ఎంతోమంది దిగ్గజ దర్శకుల దగ్గర ఆయన పని చేసాడు.. పాటలు పాడాడు. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఈయన నేపథ్య గాయకుడిగా మారాడు. 

తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు. ఆ తర్వాత చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను అందరికీ చేరువ చేసింది. ఘంటసాల తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా పాటను శ్రోతలకు చేరువ చేసిన ఘనత ఎస్పీ బాలుకు సాధ్యమైంది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. 

1969 లో మొదటిసారిగా నటుడిగా మారాడు. ఆ తర్వాత అనేక తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు ఈయన. పవిత్ర బంధం, రక్షకుడు, దీర్ఘసుమంగళీభవ, ప్రేమికుడు లాంటి సినిమాలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఓ పాప లాలీ లాంటి సినిమాల్లో హీరోగా కూడా నటించాడు బాలసుబ్రమణ్యం. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి నటీనటులకు గాత్రదానం చేసాడు. 
ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు. బాలు భారతదేశ కేంద్రప్రభుత్వం నుంచి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని.. 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. ఈయన మరణం యావత్ భారతీయ సినీ పరిశ్రమకు.. సంగీత ప్రపంచానికి తీరనిలోటు అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు అభిమానులు, సంగీత ప్రియులు, సన్నిహితులు.

More Related Stories