ఏపీ ప్రభుత్వం పై హైకోర్టుకు కృష్ణంరాజు, అశ్వినిదత్

ఏపీ ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాత అశ్వినీ దత్, నటుడు కృష్ణం రాజు హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ల్యాండ్ కి సంబంధించి వీరిద్దరూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భాగంగా అశ్వినిదత్ 40 ఎకరాల భూమిని ఇవ్వగా, కృష్ణం రాజు 31ఎకరాల భూమిని ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారంగా కాకుండా భూ సమీకరణ కింద ఆశినిదత్ తన భూమిని ఇచ్చారు.
కాగా ఆ భూమికి బదులుగా ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో అశ్వినిదత్ కు భూమిని కేటాయించింది. ఇక ఏపీ ప్రభుత్వం రాజధాని విషయంలో నిర్ణయం మార్చుకోవడంతో అశ్వినిదత్ కు నష్టం జరుగుతుందని వాపోయారు. దాంతో ఆయన ప్రభుత్వం అగ్రిమెంట్ ను ఉల్లంఘించిందంటూ కోర్టును ఆశ్రయించారు. విమానాశ్రయ విస్తరణను ఆపేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. తన భూమిని తిరిగి ఇవ్వాలని లేదంటే భూ సేకరణ కింద నాలుగు రెట్లు ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం కింద తనకు రూ.210 కోట్లు ఇవ్వాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.