English   

థియేటర్స్ వద్దు.. ఓటీటీ ముద్దు అంటున్న నిర్మాతలు..

Producers OTT
2020-10-02 08:52:46

అక్టోబర్ 15 నుంచి థియేటర్స్, మల్టీప్లెక్స్ లు తెరుచుకోవచ్చు అంటూ కేంద్రం తీపి కబురు చెప్పింది. 6 నెలలుగా మూతపడి ఉన్న సినిమా థియేటర్లకు మునుపటి కళ వస్తుంది అంటూ ఎగ్జిబిటర్లు పండగ చేసుకుంటున్నారు. అయితే వాళ్లు అనుకున్న మంచి రోజులు ఇప్పట్లో రావు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పటికే సినిమా పరిశ్రమ దాదాపు 10 వేల కోట్లు నష్టపోయింది. గత ఆరు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడి దారుణంగా నష్టపోయారు. మరికొందరు జీవనాధారం లేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేయాలనుకోవడం నిజంగా శుభసూచకం. కానీ ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. 

థియేటర్స్ ఓపెన్ చేసుకోమని చెప్పి కేవలం 50 శాతం టికెట్స్ మాత్రమే అమ్ముకోవాలి అని లిటికేషన్ పెట్టింది కేంద్రం. దీనికి ఏ నిర్మాత కూడా ఒప్పుకోవడం లేదు. అసలే అత్యంత దారుణమైన నష్టాల్లో ఉన్న తమకు ఇలా 50 శాతం టికెట్లు అమ్మమని చెప్పడం ఇంకా దారుణం అంటున్నారు వాళ్ళు.దీనికంటే థియేటర్స్ మూసుకొని ఉండటమే నయ్యం అంటున్నారు. ఇప్పటికే తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్న నిర్మాతలు థియేటర్స్ మీద ఆశలు వదిలేసుకుని ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. అక్కడ మంచి బేరం కుదిరితే తీసిన సినిమా వాళ్ళ చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తున్నారు.

ఎలాగూ థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా సగం సగం డబ్బులతో బయటపడలేరు. అందుకే తమ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ విడుదల చేయాలని చాలామంది నిర్మాతలు నిర్ణయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో కొన్ని సినిమాలు ఇప్పటికే క్యూ కట్టాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాతో పాటు అనుష్క నిశ్శబ్దం ఓటిటిలో విడుదలవుతున్నాయి. ఆహాలో రాజ్ తరుణ్ సినిమా వస్తుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అనుష్క సినిమా వస్తుంది. ఇదే దారిలో మరో అరడజను సినిమాలున్నాయి. ఏదైనా కూడా థియేటర్స్ ఓపెన్ చేసిన ఓటిటి మాకు ముద్దు అంటున్నారు నిర్మాతలు. మరి ఈ లెక్కన థియేటర్స్ కు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి చూడాలి. 

More Related Stories