English   

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరవడానికి ఒప్పుకోని నిర్మాతలు..

Star Producers
2020-10-03 07:56:07

అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ అని అంతా పండగ చేసుకుంటున్నారు బాగానే ఉంది.. కానీ కొన్ని అనుమానాలు అందరిలో ఉన్నాయి. అదే అనుమానం నిర్మాతల్లో కూడా వచ్చింది. అందుకే థియేటర్స్ తెరుచుకోండి అంటూ కేంద్రం పర్మిషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు వాళ్లు ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరు. థియేటర్స్ ఓపెన్ చేస్తే జనం ముందులా వస్తారా అనేది అతిపెద్ద అనుమానం. ఒకవేళ వచ్చారే అనుకుందాం.. కేవలం సగం టికెట్స్ మాత్రమే అమ్ముకోవాలి అనేది వర్కవుట్ అవుతుందా అనేది మరో పెద్ద డౌట్. తొలిరోజే పైరసీ వచ్చేస్తున్న ఈ రోజుల్లో.. 50 శాతం టికెట్స్ అమ్ముకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బయట పడతారా అనే మిలియన్ డాలర్ ప్రశ్న. అలా కాదని టికెట్ రేట్స్ పెంచేస్తే ఆడియన్స్ చూడ్డానికి వస్తారా..? అసలే ఆర్నెళ్లుగా కరోనా కరువుతో అల్లాడిపోతున్న జనం.. సినిమా టికెట్స్ రేట్ పెంచితే చూడ్డానికి వస్తారా.. లేదంటే అసలుకే మోసం వస్తుందా అనేది తెలియక తల పట్టుకున్నారు నిర్మాతలు. ధైర్యం చేసి విడుదల చేసినా 40 కోట్లు వసూలు చేసే సినిమా 20 కోట్లు కూడా రాదు.. మరి అంత ధైర్యం ఏ నిర్మాత తీసుకుంటాడు.. అలా మొదట విడుదల చేసే సినిమా కచ్చితంగా ప్రయోగమే అవుతుంది. 50 శాతం టికెట్స్ పక్కన బెట్టేద్దాం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు థియేటర్స్ అనేది సేఫేనా..? 

పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమా థియేటర్స్‌లో చూడాలనుకుంటాం.. కానీ 50 శాతం టికెట్స్ అమ్మాలంటే మరి మిగిలిన అమౌంట్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నష్టం కాదా..? మరి మిగిలిన అమౌంట్ కేంద్రం భరిస్తుందా.. అంటే అదీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవడి చావు వాడే చావాలి. సినిమా చూడ్డానికి వచ్చినోడే ఎన్ని డబ్బులైనా కట్టుకోవాలి. కేంద్రం చెప్పినట్లు చేస్తే 50 శాతం టికెట్స్‌తో వాళ్ల రెంట్లు కూడా రావు. పెద్ద సినిమాలనే పట్టించుకుంటారా లేదా.. కలెక్షన్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఉంటే.. చిన్న సినిమాలను పట్టించుకునే దిక్కు దివానం కూడా ఉండదు.. మరి వాటి సంగతేంటి..? ఇవే కాదు.. ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో థియేటర్స్ రీ ఓపెన్ చేసినా అసలు లాభం ఉంటుందంటారా..? ఏమో మరి అన్నీ కాలమే నిర్ణయిస్తుందేమో..? ఏదేమైనా థియేటర్స్ ఓపెన్ చేస్తే సినిమా చూడాలని సగటు సినీ ప్రేక్షకుడికి కూడా చాలా ఆశగా ఉంది.. చూద్దాం ఏం జరుగుతుందో..? అందుకే ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేయొద్దనే నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

More Related Stories