English   

కరోనా భయం పోతుంది.. మెల్లమెల్లగా షూటింగ్ కు సై..

Tollywood films
2020-10-04 12:18:25

కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడు కరోనా వైరస్ కు భయపడటం మానేశారు. కంటికి కనిపించని ఈ వైరస్ తో 6 నెలలు ఇంట్లో కూర్చుంది చాలు ఇక బయటికి వెళ్లి పని చేసుకుందాం అని ఫిక్స్ అయిపోతున్నారు దర్శక నిర్మాతలు. హీరోలు కూడా వాళ్లకు మెల్లమెల్లగా సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆపేసిన సినిమాలు మళ్లీ పూర్తి చేయాలని వాళ్ళు పూనుకున్నారు. దానికోసం ఒక్కొక్కరుగా అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ కు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు సాయిధరమ్ తేజ్ కూడా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. మరోవైపు శర్వానంద్ కూడా చెన్నైలో శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు సినిమాలో జాయిన్ అయ్యాడు. 

నేడో రేపో రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమాతో బిజీ కానున్నాడు. కొరటాల శివకు ఈయన నవంబర్లో డేట్స్ ఇస్తానని చెప్పాడు. అక్టోబర్ 15 నుంచి రజనీకాంత్ కూడా శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలా ప్రతి హీరో ఇప్పుడిప్పుడే బయటికి రావడానికి చూస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. చిరంజీవి, బాలకృష్ణ హీరోలు కూడా షూటింగ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. అయితే వీళ్ల వయసు 60 ఏళ్లు పైనే ఉండటంతో కాస్త ఆలోచనలో పడుతున్నారు. అసలే ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వాళ్లు బయటకు రావద్దు అని హెచ్చరిస్తుంది. దాంతో తర్జనభర్జన పడుతున్నారు మన హీరోలు. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం లేకుండా షూటింగ్ చేసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. ఏదైనా త్వరలోనే ఇండస్ట్రీ మళ్లీ మామూలు స్థితికి రానుందని ఆశలు అయితే కనిపిస్తున్నాయి. 

More Related Stories