పవర్ స్టార్ ను కలిసిన కిచ్చా సుదీప్..కీలక అంశాలపై చర్చ

జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కల్యాణ్ తో ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ సమావేశమయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గారికి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి... ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ పవన్ కళ్యాణ్ కు వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఆసక్తికర అంశం ఏమిటంటే... పవన్ కళ్యాణ్ మరియు కిచ్చా సుదీప్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీ కావడం. కాగా సుదీప్ కన్నడ తో పాటు తెలుగు లోను సినిమాల్లో నటించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో సుదీప్ విలన్ రోల్ లో నటించారు. ఈగ సినిమాలో సుదీప్ నటనకు తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఆ తరవాత సుదీప్ తెలుగులో చాలా సినిమాల్లో నటించి అలరించారు. అంతే కాకుండా సుదీప్ ఇటీవల విడుదలైన సైరా నరసింహా రెడ్డి సినిమాలోనూ ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.