English   

సౌందర్య బయోపిక్‌లో జాతీయ ఉత్తమ నటి..

Keerthi suresh
2020-10-12 13:26:52

సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. జులై 18న ఈమె జయంతి. మరణించి 16 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈమె. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంది సౌందర్య. అలాంటి హీరోయిన్ బయోపిక్ ఇప్పుడు వస్తుందని ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఇప్పటికే చాలా మంది బయోపిక్స్ వచ్చాయి. సావిత్రి బయోపిక్ మహానటి సంచలన విజయం సాధించడమే కాకుండా జాతీయ అవార్డులు కూడా దక్కించుకుంది. ఈ చిత్రంతో కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది. 

ఎన్టీఆర్, వైఎస్ఆర్ సహా చాలా బయోపిక్ ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు సౌందర్య బయోపిక్ కోసం కూడా రంగం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతుంది. మనవరాలి పెళ్లితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత అమ్మోరు సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ కొత్తలోనే పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సౌందర్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ నెంబర్ వన్ హీరోయిన్‌గా చనిపోయే వరకు కూడా ఉంది. కెరీర్ చివర్లో కూడా సంచలన సినిమాలు చేసింది సౌందర్య. కేవలం సినిమాలు, నటన మాత్రమే కాకుండా సౌందర్య జీవితంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఈమె కర్ణాటకలో చాలా సేవా కార్యక్రమాలు చేసింది. మెడికల్ కాలేజ్‌తో పాటు స్కూల్స్ కూడా కట్టించి ఉచిత విద్యను అందించింది. ఇప్పటికీ ఆ స్కూల్స్‌కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తుంది. అప్పటి లెక్కల ప్రకారమే 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు. తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య. అయితే ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికీ సౌందర్య ఇంటి నుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తూనే ఉన్నాయి. సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేసాడు. తాను చనిపోయే ఏడాది ముందే అంటే 2003 ఫిబ్రవరి 15న సౌందర్య వీలునామా రాశారని.. అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్ నాథ్ భార్య నిర్మల.. ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని.. నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టుకు విన్నవించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది. 

తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంత కాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు. 2013 డిసెంబర్ 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి. ఇవన్నీ కూడా బయోపిక్‌లో ఉంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సౌందర్య జీవితంలో అత్యంత కీలకంగా ఉన్న 1990 నుంచి 2004 వరకు ఆ 14 ఏళ్లు కీలకంగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సౌందర్య బయోపిక్ చేస్తారనే కన్నడనాట ప్రచారం జోరందుకుంటుంది. మరి అన్నీ జరిగి నిజంగానే సౌందర్య బయోపిక్ తెరకెక్కితే మరో సంచలనం తెరపై చూడొచ్చు. 
 

More Related Stories