English   

రవితేజ క్రాక్ మళ్లీ మొదలైంది.. ఏడు నెలల తర్వాత సెట్స్ పైకి..

 Mass Maharaj
2020-10-12 18:32:49

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా క్రాక్. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. పైగా ఇప్పుడు ఇద్దరూ ప్లాప్స్ లోనే ఉన్నారు. గోపీచంద్ మలినేని గత సినిమా విన్నర్ దారుణంగా నిరాశ పరిచింది. ఇక రవితేజ రాజా ది గ్రేట్ తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఈయన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతున్నాయి. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్-అక్బర్-ఆంటోని, డిస్కో రాజా ఇలా ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రేక్షకుల మనసు దోచుకున్నది లేదు. కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు. దాంతో రవితేజ మార్కెట్ భారీగా పడిపోయింది.

ఇలాంటి సమయంలో తనకు బాగా కలిసొచ్చిన గోపీచంద్ మలినేనితో క్రాక్ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. తమిళనాట సూపర్ డూపర్ హిట్ అయిన సేతుపతి సినిమా ఆధారంగా ఇది తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ సేతుపతిని తెలుగులో జయదేవ్ పేరుతో జయంత్ సి పరాన్జీ రీమేక్ చేశాడు. కానీ ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మరోసారి గోపీచంద్ ఈ సినిమాను రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఏడు నెలల తర్వాత ఈ సినిమా షూటింగ్ లోకి మళ్లీ అడుగు పెట్టాడు రవితేజ. కోవిడ్ నిబంధనలకు తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్లీ మొదలు పెట్టారు. శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. తమిళ దర్శక నటుడు సముద్రఖని ఇందులో విలన్. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. 

More Related Stories