హైదరాబాద్ లో భారీ వర్షాలు..ఇలా స్పందించిన రౌడీ

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. మొన్న రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం మొత్తం జలమయం అయింది. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో మూసినది గేట్లను ఎత్తి నీటిని పంపించారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీలో ఓ భవనం కూలి 9మంది చనిపోయారు. ఇక వరదల నుండి ప్రజలను రక్షించడానికి రక్షణ దళాలు రాత్రింబవళ్లు కష్టపడ్డాయి. ప్రజా ప్రతినిధులు సైతం రోడ్లపైకి వచ్చి నేరుగా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అయితే నగరంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి నాయకులే కారణమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలకుల నిర్లక్ష్యం వల్లనే తమకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో మూలుగుతున్న నక్క మీద వెలగ పండు పడినట్లయింది. హైదరాబాద్ వాసుల పరిస్థితి. ఇక నగరంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు. "ఇలాంటి పరిస్థితుల్లో నగరానికి దూరంగా ఉన్నందుకు బాధగా ఉంది. త్వరలోనే వస్తాను. మీ అందరి గురించి ప్రార్థనలు చేస్తున్నా..ప్రేమతో మీ విజయ్" అంటూ పోస్ట్ చేసారు.