వరద ముంపుకు గురైన బ్రహ్మాజీ ఇల్లు

హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో వరదల కారణంగా నీటిలో కొట్టుకునిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దాంతో రక్షణ దళాలు సహాయక చర్యలను చేపడుతున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం పడవల్లో వస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వరదల కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాలకు రాకపోకలు సైతం బంద్ అయ్యాయి. ఇదిలావుండగా సెలబ్రెటీలకు సైతం వరద కష్టాలు తప్పడం లేదు.
తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఇల్లు కూడా వరద ముంపుకు గురైంది. బ్రహ్మాజీ ఇంటి మెయిన్ గేటు, గ్రౌండ్ ఫ్లోర్ వద్ద భారీగా నీరు చేరింది. కాగా బ్రహ్మాజీ పై ఫ్లోర్ లో ఉండటంతో ఆయన సురక్షితంగానే ఉన్నారు. తన ఇంటి ముందుకు వరద నీరు వచ్చిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నా ఇల్లు అంటూ బ్రహ్మాజీ తన ఇంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. అంతేకాకుండా ఆయన మరో ట్వీట్ కూడా చేసారు. హైదరాబాద్ లో తిరగలంటే ఓ పవర్ బోట్ ఉండాలని, ధర ఎంతుంటుందో ఎవరైనా చెప్పాలని కోరాడు. మరోవైపు సినీ నటులు ఉండే మణికొండ ఏరియాలో కూడా కొంతవరకు వరద ముంపుకు గురైంది.