English   

తెలుగమ్మాయిలు తెలుగులో పట్టించుకోవడం లేదు.. ఏంటో ఈ ఖర్మ..

Aishwarya Rajesh
2020-10-20 18:05:14

పొరుగింటి పుల్లకూర రుచి అని ఊరికే అనరు. మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉన్నా కూడా పక్క భాష నుంచి అరువు తెచ్చుకుంటారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో తెలుగు అమ్మాయిలకు ఎప్పుడూ చిన్నచూపు ఉంటుంది. పక్క భాషల్లో వాళ్లు అద్భుతాలు చేస్తున్నా కూడా మన ఇండస్ట్రీలో మాత్రం వాళ్లను పట్టించుకోరు. అలా తెలుగు ఇండస్ట్రీ విస్మరించిన ఒక అద్భుతమైన టాలెంట్ ఐశ్వర్య రాజేష్. ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కూతురు ఈమె. కమెడియన్ శ్రీలక్ష్మికి మేనకోడలు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ తెలుగు సినిమాల కంటే కూడా తమిళనాట ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే అక్కడ ఆమె 24 సినిమాలు చేసింది. తాజాగా 25వ సినిమా విడుదలకు సిద్ధమైంది. గతేడాది కనా తెలుగు రీమేక్ కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇక్కడ నిరాశ పరిచింది. ఆ తర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించినా అది కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పట్టించుకోవడం మానేశారు. ఇక ఇప్పుడు ఈమె 25వ సినిమా భూమిక ఫస్ట్ లుక్ విడుదలైంది. రతీంద్రన్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్టుతో వస్తున్నా భూమిక తెలుగులో కూడా విడుదలవుతుంది. ఈ మధ్యే తమన్నా చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా తెలుగులో కూడా తనకు గుర్తింపు తీసుకొస్తుందని ఐశ్వర్య భావిస్తుంది. తమిళనాట అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ సొంత భాషలో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయింది. ఏదేమైనా తెలుగు అమ్మాయిలకు తెలుగులో అవకాశాలు రావనడానికి ఐశ్వర్య రాజేష్ మరో నిదర్శనం.

More Related Stories