నాగ్ వైల్డ్ డాగ్ మనాలి షెడ్యూల్ ప్రారంభం

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ మనాలీలోని సుందర ప్రదేశాల్లో మొదలైంది. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు. క్రిమినల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయనను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు.
నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున ప్రస్తుతం తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-4 లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దాంతో ప్రతి శనివారం ఆయన హోస్ట్ గా హాజరవ్వాల్సివుంది. ఈ నేపథ్యంలో గత రెండు వరాల నుండి నాగార్జున "వైల్డ్ డాగ్" షూటింగ్ కోసం వెళుతున్నారని, బిగ్ బాస్ లో హోస్ట్ గా రమ్యకృష్ణ లేదా నాని వస్తారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా రోజా వచ్చే ఛాన్స్ కూడా ఉందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కాగా నాగార్జున మాత్రం అటు సినిమా షూటింగ్ ఇటు బిగ్ బాస్ కవర్ చేసి నెటిజన్లకు షాక్ ఇచ్చారు.