English   

క్రిష్ ఫోటో షేర్ చేసిన కంగన.. గొడవలు పట్టించుకోకుండా షాకిచ్చిన బ్యూటీ.. 

Kangana Ranaut
2020-11-03 18:15:57

బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ ఎవరంటే మరో ఆలోచన లేకుండా వచ్చే పేరు కంగన రనౌత్. ఈమె ఎక్కడుంటే అక్కడ వివాదాలు పుట్టుకొస్తాయి. లేదంటే ఆమె పుట్టిస్తుంది కూడా.. ఎందుకంటే కాంట్రవర్సీ లేకపోతే కడుపు నిండదు ఈ ముద్దుగుమ్మకు. అలాగని అవనసర విషయాలు పట్టించుకుంటుందా అంటే లేదు.. అన్నీ పనికొచ్చే విషయాలపైనే పోరాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ పక్కవాళ్ల కోసం తాను విలన్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి కంగన ఇప్పుడు దర్శకుడు క్రిష్ కు షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరి మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఇదేంటో తెలియాలంటే ఏడాది వెనక్కి వెళ్లాలి. అప్పట్లో ఝాన్సీ లక్ష్మీభాయ్ బయోపిక్ మణికర్ణిక సినిమాను క్రిష్ తెరకెక్కించాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించాల్సి రావడంతో చివర్లో బయటికి వచ్చేసాడు క్రిష్. దాంతో మిగిలిన సినిమాను కంగన పూర్తి చేసి విడుదల చేసింది. అంతేకాదు డైరెక్టర్ గా తన పేరు వేసుకుంది.. క్రిష్ పేరు కూడా వేసినా అంతా తానే చేసానని చెప్పుకుంది. దాంతో క్రిష్ సీరియస్ అయ్యాడు. క్రియేటివిటీ దోచేస్తుందంటూ కంగనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. దానికి కంగన కూడా అదే స్థాయిలో సమాధానాలు ఇచ్చింది. 

తన నుంచి క్రెడిట్ లాక్కోవడానికి ప్రయత్నించడంతో పాటు తన ప్రమేయం లేకుండా కథ సన్నివేశాలను ఎలా పడితే అలా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు క్రిష్. అయితే కాలంతో పాటు ఈ ఇద్దరూ కూడా విషయాన్ని మర్చిపోయారు. మధ్యలో ఎక్కడా ఈ టాపిక్ రాలేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. బాలీవుడ్ వైపు క్రిష్ కూడా మళ్లీ వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి క్రిష్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది కంగన. అది కూడా అతడిని కౌగిలించుకున్న ఫోటోను షేర్ చేసి షాక్ ఇచ్చింది. దీని వెనక కూడా ఓ కారణం ఉంది. నవంబర్ 1న ‘మణికర్ణిక’ సినిమా నిర్మాతల్లో ఒకరైన కమల్ జైన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అప్పట్లో మణికర్ణిక ఓపెనింగ్ వారణాసిలో జరిగింది. అందులో క్రిష్ కూడా ఉన్నాడు. ఆ ఫోటోల్లో క్రిష్ ను పక్కనబెట్టకుండా అలాగే షేర్ చేసింది. ఇగోలకు పోకుండా అన్నీ మరిచిపోయి క్రిష్ తో ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గొడవ సద్దుమనిగిందనే అనుకుంటున్నారంతా.  

More Related Stories