English   

మిస్ ఇండియా రివ్యూ

Miss India
2020-11-04 22:01:50

నటీనటులు: కీర్తి సురేష్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సుమంత్ శైలేంద్ర, నవీన్ చంద్ర, నదియా, నరేష్, కమల్ కామరాజు, పూజిత పొన్నాడ.. 
సంగీతం: తమన్
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాత: మహేష్ కోనేరు
కథ, కథనం, దర్శకుడు: నరేంద్రనాథ్

'మహానటి' సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత కీర్తి సురేష్ నటించే సినిమాలపై ఆసక్తి పెరిగిపోయింది. వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది కీర్తి. ఈమె నుంచి ఆ మధ్య పెంగ్విన్ సినిమా వచ్చినా కూడా అది విజయం సాధించలేదు. ఇప్పుడు మళ్లీ 'మిస్ ఇండియా' అనే లేడి ఓరియెంటెడ్ సినిమాతో వచ్చింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో నవంబర్ 4న విడుదలైంది. మరి ఇదెలా ఉందో చూద్దాం.. 

కథ:

మానస సంయుక్త (కీర్తి సురేష్) కు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ చేయాలని కోరిక. ఎంబిఎ పూర్తి చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని కలలు కంటుంది. ఆమెకు తాత విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్) సపోర్ట్ ఫుల్లుగా ఉంటుంది. ఆయన ఆయుర్వేద వైద్యుడు. చిన్నప్పటి నుంచి కూడా ఆయుర్వేదంతో కలిపే టీ చేయడంలో సంయుక్త దిట్ట. దాంతో ఆ రుచిని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటుంది. అయితే బిజినెస్ చేయడానికి సంయుక్త అమ్మ (నదియా), అన్నయ్య (కమల్ కామరాజు) ఒప్పుకోరు. అదే సమయంలో సంయుక్త తాత చనిపోవడం.. అన్నయ్యకు జాబ్ కూడా రావడంతో కుటుంబం అంతా అమెరికాకు షిఫ్ట్ అవుతుంది. అక్కడే ఓ జాబ్ చేస్తుంది. అలాంటి సమయంలోనే విజయ్ ఆనంద్ (నవీన్ చంద్ర) పరిచయం అవుతాడు. పెళ్లి కూడా చేసుకుంటానంటాడు. కానీ బిజినెస్ కోసం నో చెప్తుంది. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఛాయ్ బిజినెస్ మొదలు పెడుతుంది. అప్పటికే అమెరికాలో కాఫీ సామ్రాజ్యం నెలకొల్పిన కైలాష్ శివ ప్రసాద్ (జగపతిబాబు)తో సంయుక్త యుద్ధం మొదలవుతుంది. అక్కడ్నుంచి ఏం జరిగింది అనేది కథ.. 

కథనం:

ఏ ఛాయ్.. చటుక్కున తాగరా భాయ్ అని అప్పుడెప్పుడో చిరు చెప్పాడు.. ఆయానేదో సినిమా మధ్యలో పాట కోసం అలా చెప్పాడు. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ మాత్రం మెగాస్టార్ పాటను.. ఛాయ్ ని సీరియస్ గా తీసుకుంది.. అదే మిస్ ఇండియా.. కేరాఫ్ ఛాయ్. కాన్సెప్ట్ కొత్తగానే ఉంది గానీ తీసిన విధానం మాత్రం ఆకట్టుకోలేదు.. అస్సలు ఆకట్టుకోలేదు.. ఆడవాళ్లు గొప్పవాళ్ళు.. వాళ్లు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అని చెప్పడం మంచిదే..

కానీ అలా చెప్పడానికి సరైన కథ, కథనం కూడా ఉండాలి.. కీర్తి సురేష్ లాంటి జాతీయ ఉత్తమ నటి ఉన్నప్పుడు.. ఆమెకు సరిపోయే పాత్ర పడకపోతే సినిమా ఎంత విసిగిస్తుందో చెప్పడానికి నిదర్శనం మిస్ ఇండియా. సినిమాలో ఆహా అనుకునే సీన్ ఒక్కటి కూడా కనిపించలేదు. సినిమా మొదలైన దగ్గర్నుంచి కూడా ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే కనిపించలేదు. ముఖ్యంగా బిజినెస్ చేయాలనుకున్నపుడు పడే కష్టం చూపించారు.. ఎదిగే సమయంలో పడే కష్టాన్ని మరిచిపోయాడు దర్శకుడు. మరీ రెండు నెలల్లోనే ఎన్నో ఏళ్లుగా స్థాపించుకున్న కాఫీ సామ్రాజ్యాన్ని కూల్చే స్థాయికి ఎదిగారంటే నమ్మడం సాధ్యం కాదు. సినిమాలో ఇలాంటి లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కష్టపడినప్పుడు వచ్చిన విజయం రుచి కూడా చాలా మజాగా ఉంటుంది.. కానీ పోటీ లేకుండా వన్ సైడ్ వార్ అయిపోయింది ఈ సినిమా కథ.. హీరోయిన్ ఏం చేసినా నల్లేరు మీద నడకే.. అమెరికా లాంటి దేశంలో మన ఛాయ్ అమ్మడం అనే ఐడియా కొత్తగా ఉంది. కానీ తెరపై చూపించడంలో దర్శకుడు నరేంద్రనాథ్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయినట్లు అనిపించింది.. కొన్ని చోట్ల అసలు లాజిక్ ఉండదు.. కొన్ని క్యారెక్టర్స్ కు జస్టిఫికేషన్ లేదు. నవీన్ చంద్ర క్యారెక్టర్ బలవంతంగా ముగించినట్లు అనిపించింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అల వైకుంఠ పురంలో సినిమాను గుర్తు చేసింది. విలన్ గా జగపతిబాబు స్టైలిష్ గా ఉన్నాడు.. కీర్తి సురేష్ గురించి ఏం చెప్పాలి.. నటిగా అద్భుతం. కానీ తన స్థాయి ఇది కాదు.. అంతకుమించి. ఓవరాల్ గా మిస్ ఇండియా.. రుచి లేని ఛాయ్..

టెక్నికల్ టీం:

తమన్ సంగీతం రిపీట్ మోడ్ లో వినిపించింది. ముఖ్యంగా అల వైకుంఠపురములో స్కోర్ ఎక్కువగా వినిపించింది. అయితే పాటలు మాత్రం బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా వీక్‌గానే ఉంది. ఫస్టాఫ్ పర్లేదు అనిపించినా సెకండాఫ్ లో కొన్నిచోట్ల ల్యాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. నరేంద్రనాథ్ కథ కొత్తగా ఉన్నా కూడా కథనం విషయంలో మాత్రం చాలా వీక్. కీర్తి లాంటి నటిని చేతిలో పెట్టుకుని కూడా ఆయన సరిగ్గా వాడుకోలేకపోయాడేమో అనిపించింది. టేకాఫ్ బాగానే ఉన్నా ఆ తర్వాత డీలా పడిపోయింది కథనం. హీరో విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా అనిపించలేదు. ఓవరాల్ గా ఐడియా బాగానే ఉన్నా తెరకెక్కిన విధానం మాత్రం బాగోలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. 

చివరగా: రుచి పచి లేని ఛాయ్.. ఈ మిస్ ఇండియా.. 

More Related Stories