English   

ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాస్‌కు రోడ్డు ప్రమాదం.. 

Singer Vijay Yesudas
2020-11-04 17:22:13

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా విషాదాలు జరుగుతున్నాయి. తాజాగా మరో వార్త బయటికి వచ్చింది. ప్రముఖ నేపథ్య గాయకుడు విజయ్‌ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. సొంత రాష్ట్రమైన కేరళలోని కొచ్చిలోనే ఈ ప్రమాదం జరిగింది. తన స్నేహితుడితో కలిసి తిరుమనంతపురం నుంచి కొచ్చి వెళ్తున్న సమయంలో విజయ్ యేసుదాసుకు ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వస్తున్న విజయ్ కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది. దాంతో రెండు కార్లకు కూడా ముందు భాగాలు దారుణంగా నుజ్జు నుజ్జయ్యాయి. కానీ అదృష్టవశాత్తూ విజయ్ మాత్రం సురక్షితంగా బయట పడ్డాడు. తృటిలో ప్రాణాపాయం తప్పిందని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాత్రి 11.30 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో విజయ్ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు సన్నిహితులు, అభిమానులు. అయినా కూడా ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి అతడికి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు విజయ్ యేసుదాస్. ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసు తనయుడిగా వచ్చినా కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మలయాళంలో సింగర్స్‌కు అంతగా గుర్తింపు లేకపోవడంతో సొంత భాషలో పాటలు పాడనని.. ఇకపై కేవలం తమిళం, తెలుగులోనే పాడతానంటూ ఈ మధ్యే ప్రకటించాడు విజయ్ యేసుదాస్. మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇంతలోనే విజయ్ కారు ప్రమాదానికి గురి కావడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. 

More Related Stories