తెలంగాణాలో సోనూసూద్ కు గుడి..ప్రత్యేక పూజలు

కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సోనూసూద్‌కు తెలంగాణ ప్రజలు ఏకంగా గుడి కట్టేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బ తండాలో సోనూసూద్‌కు గిరిజనులు గుడి కట్టి పూజలు చేస్తున్నారు. సోనూసూద్ లక్షలాది మందికి చేస్తున్న సాయాన్ని చూసి తాము ఆయన్ని దేవుడిగా భావిస్తున్నామని, అందుకే గుడి కట్టాడని స్థానికులు చెబుతున్నారు. కలియుగ దానకర్ణుడికి గుడి కట్టడం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సోనూసూద్ లాక్డౌన్లో వేలాది కార్మికులను ఆదుకోవడంతో అందరికీ రియల్ హీరోగా మారిపోయారు.
ఆపన్నులకు సాయం చేసేందుకు ఆయన తన ఆస్తులు కూడా తాకట్టు పెట్టాడని ఇటీవల వెలుగులోకి వచ్చింది. దాంతో ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినిమాల్లో విలన్ వేషాలు వేస్తూ హీరోలతో దెబ్బలు తినే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం తాను హీరోనేనని నిరూపించుకున్నాడు. దీంతో దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే కష్టం వస్తే స్థానిక నాయకులకో, అధికారులకో, అక్కడి ప్రభుత్వాలకో చెప్పుకోకుండా సోనూకి ఒక్క ట్వీట్ పెడుతున్నారు. అలా సాయం కోరుతూ ట్వీట్స్ ఎంతోమందికి నేనున్నానంటూ ముందుకొచ్చి సోనూసూద్ సాయం చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ మొదలుపెట్టిన తన సేవా కార్యక్రమాలను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.