వైఎస్ఆర్ రూట్లోనే పవన్..సక్సెస్ అవుతాడా..

ఏపీలో టీడీపీ ఫామ్ లో ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సీఎం గా గెలిచాడు. అయితే రాజశేఖర్ రెడ్డి సీఎం గా గెలవడానికి ముఖ్యకారణం ఆయన ఎన్నికల ముందు చేసిన పాదయాత్రేనట. 2003 లో వైఎస్ పాదయాత్ర కారణంగానే ప్రతికూల పరిస్థితుల్లో సైతం 2004 ఎన్నికల్లో విజయం సాదించాడట. ఇక 2013 లో నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారు. దాంతో 2014 లో అధికారాన్ని దక్కించుకున్నారు. ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ ఏకంగా 18నెలలు 134 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ఎన్నికల్లో అవలీలగా గెలిచారు. ఇక ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని చూస్తున్నారట.
2024 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి ఏపీలో జనసేన జండా ఎగరవేయ్యాలని డిసైడ్ అయ్యారట. అందుకోసం 2022 కల్లా ఆయన ఒప్పుకున్న సినిమాల షూటింగ్ లు పూర్తి చేసి జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవగానే పవన్ మలయాళ రీమేక్ మనటించనున్నారు. అనంతరం క్రిష్ తో ఓ సినిమా, సంపత్ నంది తో ఓ సినిమా చేయనున్నారు. ఇదివరకు ఒక్కో సినిమాకు రెండేళ్ల టైం తీసుకునే పవన్ ఎన్నికల కోసం చక చకా సినిమాలు పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారట. అంతే కాకుండా పాదయాత్ర కోసం ఇప్పుడే ప్రణాళికలు కూడా రచిస్తున్నారట. వైఎస్ఆర్ ఫార్ములా పవన్ కు వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.