రజినీకాంత్ కీలక నిర్ణయం...రాజకీయపార్టీ ప్రకటన పై వెనక్కి

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈనెల 31న పార్టీ ప్రకటన కూడా లేదని రజినీకాంత్ స్పష్టం చేసారు. ఈమేరకు ఆయన ఓ మూడు పేజీల లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆరోగ్యం సహకరించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అభిమానులకు రజిని క్షమాపణలు చెప్పారు. ఇక ఇటీవల రజినీకాంత్ అభిమానులతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో పార్టీ గుర్తును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ గుర్తుగా రజినీకాంత్ ఆటోను ప్రకటించారు. అంతే కాకుండా పార్టీ పేరును "మక్కల్ సెవై కచ్చి" గా ఖరారు చేసారు. ఈనెల 31న పార్టీపై అధికారిక ప్రకటన చేస్తానని చెప్పారు. కానీ ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ చెన్నై లోని అతడి నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు.