English   

ఉప్పెనపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..వైష్ణవ్ రిస్క్ చేస్తున్నాడు

Pawan Kalyan
2021-02-11 23:42:50

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన "ఉప్పెన" సినిమా ఈనెల 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు కలిసి చూపించారు. ట్రైలర్ చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలోనే మంచి పాత్రను ఎంచుకున్నాడని అన్నారు. మొదటి అడుగులోనే సవాల్ తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తేజ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడని అన్నారు. వైష్ణవ్ ‘జానీ’ చిత్రంలో బాల నటుడిగా.. హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడని పవన్ గుర్తు చేశారు. 

ఇప్పుడు హీరోగా ఎదిగాడని ‘ఉప్పెన’లో వైష్ణవ్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాడని అన్నారు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారని అర్థం అవుతోందన్నారు. మనకు పరిచయం ఉన్న జీవితాలను,  అందులోని ఎమోషన్స్ ను, మన నేటివిటీనీ కళ్ల ముందుకు తీసుకువచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకంగా మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. "రంగస్థలం, దంగల్ " లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ కాలం మనకు గుర్తుండిపోతాయని అన్నారు.  ‘ఉప్పెన’ కథలోని ఎమోషన్స్ కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయని చెప్పారు. మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబుకు ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు పవన్ అభినందనలు తెలిపారు.

More Related Stories