English   

గుణశేఖర్ అది పూర్తిగా మరిచిపోయాడా...

Gunasekhar
2021-03-16 17:08:22

తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు గుణశేఖర్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాతికేళ్ల కిందట మెగా ఫోన్ పట్టిన ఈయన సంచలన సినిమాలు తెరకెక్కించాడు. కెరీర్ మొదట్లో లాఠీ, సొగసు చూడ తరమా లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన గుణశేఖర్.. చూడాలని ఉంది సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా రికార్డులు తిరగ రాసింది. చిరంజీవి లాంటి హీరోను గుణశేఖర్ చూపించిన విధానం మిగిలిన హీరోలను కూడా ఆకట్టుకుంది. దాంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కమర్షియల్ అంశాలు పక్కాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన చేసిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అప్పటి వరకు ఎలాంటి ఇమేజ్ లేని మహేష్ బాబు ఒక్కడు సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. 

అయితే ఎందుకో తెలియదు ఒక్కడు తర్వాత గుణశేఖర్ పూర్తిగా బ్యాలెన్స్ తప్పినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత చేసిన అర్జున్, సైనికుడు, నిప్పు సినిమాలు ఆకట్టుకోలేదు. దాంతో కమర్షియల్ సినిమాలకు దూరంగా హిస్టారికల్ సబ్జెక్టు దగ్గరగా వచ్చేసాడు గుణశేఖర్. ఆరేళ్ల కిందట అనుష్కతో రుద్రమదేవి సినిమా చేశాడు ఈ దర్శకుడు. అది కూడా ఆవరేజ్ గానే ఆడింది. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ సొంత నిర్మాణంలో రుద్రమదేవి తెరకెక్కించాడు. ఆ సినిమా తర్వాత మరోసారి హిస్టారికల్ సబ్జెక్టు తోనే వస్తున్నాడు గుణశేఖర్. 

ప్రస్తుతం సమంత అక్కినేని ప్రధానపాత్రలో శాకుంతలం సినిమా తెరకెక్కిస్తున్నాడు. మహాభారతంలో దుష్యంతుడు, శకుంతల ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత రానా హీరోగా హిరణ్యకశ్యప ప్లాన్ చేస్తున్నాడు. ఇలా వరుసగా హిస్టారికల్, మైథలాజికల్ సినిమాలు చేస్తున్నాడు గుణశేఖర్. ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలు చేయలేక హిస్టారికల్ వైపు అడుగులు వేస్తున్నాడు గుణశేఖర్. మరి ఇందులో ఆయన ఎంతవరకు విజయం సాధిస్తాడో చూడాలి.

More Related Stories