English   

వకీల్ సాబ్ మేనియా..ట్రైలర్ కోసం థియేటర్ అద్దాలు బద్దలు 

Vakeel SaabTrailer
2021-03-30 13:30:21

కేవలం ట్రైలర్ రిలీజ్ కే సినిమా రిలీజ్ అంత హడావిడి చేశారు పవన్ అభిమానులు. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానుల హంగామా కనిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ మేనియా కళ్ళకు కట్టినట్లు కనిపించింది. రాజకీయాల వలన మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ మార్చి 29న విడుదల చేశారు. 

అయితే ట్రైలర్ కూడా థియేటర్లలో విడుదల చేసే పద్ధతి వకీల్ సాబ్ తీసుకొచ్చాడు. దీనికి ముందు కూడా కొన్ని థియేటర్లలో విడుదల చేశారు కానీ ఇప్పుడు చేసినంత హంగామా మాత్రం ఎప్పుడూ చేయలేదు. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఏరియాలలో ఉన్న థియేటర్స్‌లో ప్లే చేశారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శ్రీరామ్ వేణు, దిల్ రాజుతో పాటు ఇతర యూనిట్ సభ్యులు కూడా హాజరయ్యారు. 

వైజాగ్‌లోని ఓ ప్రాంతంలో అభిమానులు థియేటర్ అద్ధాలు పగలగొట్టుకొని మరీ లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ విడుదల ఇలా ఉంటే రేపు సినిమా విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది అని సోషల్ మీడియాలో కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

More Related Stories