English   

మా ఎన్నికలకు తేదీ ఖరారు.

date-fixed-for-for- MAA elections
2021-08-25 22:29:13

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు మూడు నెలల నుంచే హాడావిడి మొదలైంది. ప్రకాష్‌ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు..  అధ్యక్ష పదవికి పోటీపడుతుండడంతో ఈసారి ఎవరు మా అధ్యక్షుడుగా గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఇప్పటి వరకు మా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది క్లారిటీ లేదు. అయితే.. క్రమశిక్షణా సంఘం పై సభ్యుల ఒత్తిడి పెరుగుతోన్న నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన ఈ ఎన్నికలు జరపాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రస్తు అధ్యక్షుడు నరేష్‌ ప్రకటించారు.

మా ఎన్నికల నేపధ్యంలో ఒకరిని మించి ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో మా ప్రతిష్టను కాపాడేందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగడం.. డీఆర్‌సీకు లెటర్ రాయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుత కమిటీ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసిపోయిందని.. కొత్త కమిటీ ఏర్పాటు కాకపోవటం వల్ల పలు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని చిరంజీవి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ తదనంతర పరిస్థితుల వల్ల అనేక మంది మా సభ్యులు ఇబ్బందులకు గురి అవుతున్నారని.. వారందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని.. అందువల్ల వెంటనే ఎన్నికలు జరిపి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. 

ఇటీవల జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో కూడా సభ్యులు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది. సీనియర్ నటులు కృష్ణంరాజు, మురళీమోహన్ అతి త్వరలోనే ఎన్నికల తేదీని అనౌన్స్ చేస్తామన్నారు. చెప్పినట్టుగానే అక్టోబర్ 10 ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు పోటీ చేస్తామని ప్రకటించిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావుతో పాటు ఇప్పుడు కాదంబరి కిరణ్ కూడా పోటీకి రెడీ అంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇంకెంత మంది మా అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికల తేదీ వచ్చేసింది కాబట్టి.. ఫైనల్‌గా మా అధ్యక్ష బరిలో ఎవరెవరు ఉండబోతున్నారు? ఎవరెవరికి మధ్య పోటీ ఉండబోతోంది? అనే విషయాల పై కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి... ఈసారి ఎన్నికల్లో గెలిచి మా అధ్యక్షుడు ఎవరు అవుతారో తెలియాలంటే అక్టోబర్ 10 వరకు ఆగాల్సిందే. 

More Related Stories