శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ.

సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రానికి పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకుడు కావడం.. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో శ్రీదేవి సోడా సెంటర్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఈరోజు (ఆగష్టు 27)న శ్రీదేవి సోడా సెంటర్ మూవీ రిలీజ్ అయ్యింది. ఇంతకీ.. శ్రీదేవి సోడా సెంటర్ ప్రేక్షకులను మెప్పించిందా..? సుధీర్ బాబుకు ఆశించిన విజయాన్ని అందించిందా.? అనేది చెప్పాలంటే.. ముందుగా కథ చెప్పాలి.
కథ - అమలాపురం దగ్గరలో ఉన్న ఓ ఊరిలో సూరిబాబు(సుధీర్‌బాబు) పేరున్న ఎలక్ట్రీషియన్. చుట్టు పక్కల ఏ పండగ జరిగినా.. పెళ్లి జరిగినా.. లైటింగ్ పెట్టాలంటే సూరిబాబే పెట్టాలి. ఊరిలో జాతర జరుగుతుంటుంది. ఈ జాతరలో సంజీవరావు (నరేష్) సోడా షాపు పెడతాడు. ఈ సంజీవరావు కూతురు శ్రీదేవి (ఆనంది). తొలి చూపులోనే సూరిబాబు.. శ్రీదేవి పై మనసు పారేసుకుంటాడు. ముందు ఒప్పుకోకపోయినా.. ఆతర్వాత సూరిబాబు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుని శ్రీదేవి ఓకే చెబుతుంది. అయితే.. వీరి ప్రేమకు కులం అడ్డంకిగా మారుతుంది. ఇదిలా ఉంటే.. ఊరి పెద్ద కాశీ (పావుల్ నవగీతమ్), అతని అనుచురలతో గొడవ కారణంగా సూరిబాబు జైలుపాలవుతాడు.
అయితే.. కేసు కొట్టేస్తారు.. తర్వాత పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు సూరిబాబు, శ్రీదేవి. అయితే.. ఊహించని విధంగా ఆ కేసు సూరిబాబుకు చుట్టుకుంటుంది. జైలుకు వెళతాడు. ఆతర్వాత సూరిబాబు జీవితంలో ఏం జరిగింది..? శ్రీదేవి ఏం చేసింది..? కూతురు ప్రేమను వ్యతిరేకించే సంజీవరావు ఏం చేశాడు.? జైలు నుంచి బయటపడిన సూరిబాబు ఏం చేశాడు.? చివరి ఈ ప్రేమికులు ఒక్కటయ్యారా..? లేదా..? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్
సుధీర్ బాబు, ఆనంది, నరేష్ నటన
డైలాగ్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో సాగదీయడం..
కథలో కొత్తదనం లేకపోవడం..
విశ్లేషణ - ప్రేమకు అడ్డం పరువు అనే కథాంశంతో ఇప్పటి వరకు చాలా కథలు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే.. ఈ కథలో కొత్తదనం ఏమీ లేదనే చెప్పాలి. అయితే.. ఈ సినిమాలో పాత్రలు పోషించిన వాళ్లకి మాత్రం కాస్త కొత్తే. ముఖ్యంగా కథానాయకుడు సుధీర్ బాబుకు ఈ తరహా కథ కొత్తే. ఇందులో లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు చాలా బాగా నటించాడు. అలాగే అమలాపురం అమ్మాయిగా ఆనంది పాత్రకు తగ్గట్టుగా నటించింది. వీళ్ల తర్వాత చెప్పుకోవాల్సింది నరేష్ గురించే. కథానాయిక తండ్రి సంజీవరావు పాత్రలో నరేష్ పాత్రకు ప్రాణం పోసాడు. ఓ వైపు పరువు కోసం పాకులాడే తండ్రిగా, మరో వైపు కూతురు పై ప్రేమను చూపించే తండ్రిగా పాత్రలో
నరేష్ అద్బుతంగా నటించాడు.
దర్శకుడు కరుణకుమార్ తొలి చిత్రం పలాసతో ఊరి చివరి జీవితాల్ని అత్యంత సహజంగా తెరపై కి తీసుకొచ్చి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈసారి కూడా వాస్తవికతకే పెద్ద పీట వేసినా.. పలాస స్థాయి ప్రభావం మాత్రం చూపించలేకపోయారు. సినిమా ప్రథమార్ధంలో సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అయితే.. సెకండాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడా బోర్ అనేది లేకుండా సాగుతుంది. ఈ సినిమాకి క్లైమాక్స్ బలాన్ని ఇచ్చింది. కాకపోతే ఈ తరహా ముగింపు కూడా సినీ అభిమానులకి కొత్తేమీ కాదు. తన కథ రీత్యా దర్శకుడు ఇచ్చిన ముగింపు మాత్రం మెప్పిస్తుంది.
పెద్దమనిషి అంటే.. ముద్దపెట్టేవాడు.. ముద్దలాక్కునేవాడు కాదు.. మంచోడే కానీ.. మనోడు కాదు.. తదితర డైలాగులు బాగున్నాయి. సత్యం రాజేశ్, రఘుబాబు, అజయ్, సప్తగిరి తదితరులు ఆయా పాత్రల పరిధి మేరకు నటించారు. శ్యాందత్ కెమెరా పనితనం అడుగగడునా కనిపిస్తుంది. ముఖ్యంగా పడవ పోటీల్లో విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే.. ఈ ఎపిసోడ్ ను ఉత్కంఠ కలిగించేలా తీయలేకపోయాడు దర్శకుడు. మణిశర్మ సంగీతం చిత్రానికి ప్రధాన బలం అని చెప్పచ్చు. ఫైనల్ గా శ్రీదేవి సోడా సెంటర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్తదనం లేని సినిమా. సరదాగా ఓసారి చూడచ్చు.