English   

వేడెక్కిన "మా" రాజకీయం

Maa Elections 2021
2021-10-05 21:30:56

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నికలు ఈ నెల 10న జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయం వేడెక్కుతుంది. ఒక‌రి పై ఒక‌రు ఘాటుగా విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌డంతో సెల‌బ్రిటీల నుంచి కామన్ మేన్ వ‌ర‌కు మా ఫ‌లితం ఎలా ఉంటుంది..? ఎవ‌రు విజేత‌గా గెలుస్తారు..? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే..  మంచు విష్ణు ప్యాన‌ల్ పై ప్ర‌కాష్ రాజ్ ఎన్నిక‌ల అధికారికి పిర్యాదు చేశారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. క‌రోనా కార‌ణంగా మా ఎన్నిక‌ల్లో 60 ఏళ్లు నిండిన వాళ్లకు పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 60 ఏళ్లు నిండిన వాళ్లు 125 మంది ఉన్నారు. అందులో 58 మంది పోస్ట‌ల్ బ్యాలెట్స్ ను తీసుకుని వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఓట్లు వేయించార‌ని.. ఇదంతా మంచు విష్ణు ప్యాన‌ల్ కి చెందిన చిన్నా అనే వ్య‌క్తి చేశార‌ని ప్ర‌కాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఆ 58 మంది పోస్ట‌ల్ బ్యాలెట్ కు సంబంధించి క‌ట్టాల్సిన అమౌంట్ ను కూడా ఒక వ్య‌క్తే క‌ట్టార‌ని.. ప్ర‌కాష్ రాజ్ తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

అనంతరం ప్ర‌కాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ... విష్ణు తరఫున ఓ వ్యక్తి 58 మంది సభ్యుల తరఫున 28 వేలు కడితే... ఎలా తీసుకున్నారు? అని ప్ర‌శ్నించారు.  కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్‌, శరత్‌బాబు తదితరుల పోస్టల్‌ బ్యాలెట్‌ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం ఇంత దిగజారుతారా? ఈ విషయం పై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి అని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ఊహించ‌ని ఈ ప‌రిణామాల‌తో మా రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది.

More Related Stories