English   

కొండ‌పొలం సినిమా ఇంత బాగా రావడానికి ఆయనే ప్రధాన కారణం - క్రిష్‌.

Kondapolam pre release event
2021-10-06 21:28:45


 మెగాసెన్సేష‌న్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం కొండపొలం. యాక్షన్ మ‌రియు అడ్వెంచ‌ర‌స్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకం పై ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొండ‌పొలం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు. 

ఈ సంద‌ర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. ‘ఇంత త్వరగా ఎలా సినిమా తీస్తావ్ అని అడుగుతుంటారు. కానీ పని దినాలు తక్కువే అయినా పని వేళలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తుంటాం. నీకు అవసరం, ఇండస్ట్రీకి అవసరం వెళ్లు సినిమా చేయ్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మధ్యలో వేరే సినిమా చేసేందుకు ఒప్పుకున్న నిర్మాత ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు. పుస్తకాల షాపులు మూసేస్తున్నారు. సినిమాకు కావాల్సిన ముడి పదార్థం స్టోరీ. కొంత మంది గొర్రెలను తీసుకుని అడవికి వెళ్తే అది పిక్నిక్ కాదు. అది సాహసయాత్ర. కొండపొలం పుస్తకం చదివిన తరువాత.. అందులో స్త్రీ పాత్ర లేదు. గొర్రెలు కాసేందుకు అడవికి వెళ్లిన కుర్రాడు.. మళ్లీ అదే అడవిని కాపాడే అధికారిగా వస్తాడు.

అలాంటి స్టోరీలో అందమైన ప్రేమకథను జోడించి తెర పై ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్నాను. మళ్లీ సినిమా కోసం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారితో కథను రాయించాను. స్క్రీన్ ప్లే మాత్రమే నేను రాశాను. ఇక్కడకు వచ్చిన హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్. బుచ్చిబాబు సానా వల్ల ఓ మంచి హీరో ఇండస్ట్రీకి దొరికాడు. బొడ్డు కోయడం చాలా కష్టం. అలా బొడ్డు కోసి ఆ బిడ్డను మాకు ఇచ్చాడు. మహేష్ విట్టా చెప్పినట్టుగా వైష్ణవ్ తేజ్‌ను కలిసిన ఐదు నిమిషాలకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది.. నేను హగ్ చేసుకుని భుజం మీద ముద్దు పెట్టేశాను. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్‌కు బెంచ్ మార్క్ క్రియేట్ అయింది. 

అంత కంటే పై మెట్టు ఎక్కిస్తున్నాను. అలాంటి కథ, పాత్ర దొరికింది. ఓబులమ్మగా నటించిన రకుల్ గురించి చెప్పాలి. రకుల్ అంటే అందమైన అమ్మాయి, వర్కవుట్లు అని అంటారు కానీ... ఆమె లోలోపల వేరే ఉంది. క్రమశిక్షణ, అంకితభావం, డైలాగ్స్ నేర్చుకునే తీరు, ఆ యాసతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కథ చెప్పేటప్పుడే ఓబులమ్మ పాత్రలో రకుల్‌ను చూశాను. రకుల్‌ అని మరిచిపోయి ఓబులమ్మ అని పిలుస్తున్నాను. ఓబు అంటే అడవి అంత గొప్పది అని రాసుకున్నాను. ఈ పాత్రను ఒప్పుకున్నందుకు రకుల్‌కు థ్యాంక్స్. 

సాయి చంద్ గారి గురించి ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అక్టోబర్ 8న సినిమా విడుదలైన తరువాత మాట్లాడుతాను. కీరవాణి గారు మా గైడ్‌లా మారారు. సినిమా ఇంత బాగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఇలాంటి సమయంలో సినిమాను ఇంత బాగా రీచ్ అయ్యేలా చేసిన వంశీ శేఖర్‌లకు థ్యాంక్స్. ఇది మ‌నంద‌రం గర్వపడే సినిమా. ఎంజాయ్ చేసే చిత్రం. సినిమాను బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

More Related Stories