శ్రీ పునీత్ రాజ్ కుమార్ మృతి దిగ్భ్రాంతికరం - పవన్ కళ్యాణ్

ప్రముఖ కన్నడ కథానాయకుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారు తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నమ్మశక్యం కాలేదు. శ్రీ పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలియచేశారు. ప్రముఖ నటులు, కన్నడ కంఠీరవ దివంగత శ్రీ రాజ్ కుమార్ గారి కుమారుడిగా ఆయన అడుగుజాడల్లో నట ప్రయాణం సాగించారు. శ్రీ పునీత్ గుండెపోటుతో స్వర్గస్తులు కావడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
బాల నటుడిగానే కన్నడ ప్రేక్షకులకు చేరువైన ఆయన ఆ దశలోనే ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. కథానాయకుడిగా ఎన్నో విజయాలు దక్కించుకొన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న శ్రీ పునీత్ అనూహ్యంగా మృతి చెందటం సినీ ప్రేక్షలకు బాధాకరం. శ్రీ పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలియచేశారు.