English   

ఆట‌గాళ్లు రివ్యూ: 

Aatagallu-Review
2018-08-24 08:08:55

నారా రోహిత్ సినిమా అంటే ఏదో కొత్త‌గా ఉంటుంది అనే ఆస‌క్తి ముందు నుంచి ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా అది పోగొట్టుకుంటున్నాడు ఈ హీరో. ఇప్పుడు మ‌ళ్లీ ఆట‌గాళ్లు అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మ‌రి ఇది ఈ సారి నిల‌బెట్ట‌కున్నాడా లేదా..?

క‌థ‌: సిద్ధార్థ్(నారా రోహిత్) పెద్ద ద‌ర్శ‌కుడు. వ‌ర‌స విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీని ఊపేస్తుంటాడు. ఇలాంటి ద‌ర్శ‌కుడు అనుకోకుండా ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఇరుక్కుంటాడు. త‌న భార్య (ద‌ర్శిక భాన‌త్) హ‌త్య కేసులో ముద్దాయిగా పోలీసుల ముందు లొంగిపోతాడు. కానీ ఆ హ‌త్య చేసింది త‌ను కాద‌ని.. అప్ప‌ట్లో సిద్ధూ భార్య‌ను ప్రేమిస్తున్నాన‌ని వేధించిన మున్నా అని తేలుస్తాడు లాయ‌ర్ వీరేంద్ర‌(జ‌గ‌ప‌తిబాబు). కానీ అంత‌లోనే సిద్ధూ నుంచి ఊహించ‌ని షాక్ తింటాడు వీరేంద్ర‌. అప్పుడు ఏం జ‌రిగింది..? ఎందుకు త‌న‌ను కాపాడిన వీరేంద్ర‌కు సిద్ధూ ఇచ్చాడు అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: ఆట‌గాళ్లు చెప్పుకోడానికి చాలా చిన్న క‌థ‌. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని చేధించే లాయ‌ర్ క‌థ ఇది. నేరం చేసింది ఒక‌రు అయితే.. శిక్ష ప‌డేది మరొక‌రికి. వంద‌మంది దోషులు త‌ప్పించుకున్నా ప‌ర్లేదు కానీ ఒక్క నిర్ధోషికి శిక్ష ప‌డ‌కూడ‌దంటారు. ఇదే లైన్ తీసుకుని క‌థ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు ప‌రుచూరి ముర‌ళి. కానీ ప‌క‌డ్భందీ స్క్రీన్ ప్లే రాసుకోవ‌డం మ‌ర్చిపోయాడు. ఒక‌ప్పుడు నీ స్నేహం.. పెద‌బాబు లాంటి సినిమాల‌తో అల‌రించిన ఈ ద‌ర్శ‌కుడు.. ఇప్పుడు మాత్రం అంత మాయ చేయ‌లేక‌పోతున్నాడు. ఆట‌గాళ్లులో కూడా ఆస‌క్తిక‌రంగా అనిపించే స‌న్నివేశాలేవీ క‌నిపించ‌వు. అన్నీ ఓపిక‌కి ప‌రీక్ష పెట్టే సీన్స్ త‌ప్ప‌. మ‌ర్డ‌ర్ జ‌రిగిన త‌ర్వాత వేగంగా ఆస‌క్తిక‌రంగా జ‌ర‌గాల్సిన ఇన్వెస్టిగేష‌న్ నీరు గార్చేసాడు ద‌ర్శ‌కుడు. ఆ స‌న్నివేశాల‌ను మ‌రింత ప‌క్కాగా రాసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ఎక్క‌డా పెద్ద‌గా ఎగ్జైటింగ్ గా అనిపించే సీన్స్ రావు. అయితే నారా రోహితే క‌థ‌కు అస‌లు విల‌న్ అని తెలిసిన త‌ర్వాత అయినా ఆ టెంపో కొన‌సాగించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు ద‌ర్శ‌క‌డు. అప్ప‌టికే ప‌ట్టుజారిన స్క్రీన్ ప్లే సినిమాను కూడా ట్రాక్ నుంచి ప‌క్క‌కు త‌ప్పించింది. సెకండాఫ్ లో కూడా హీరోనే విల‌న్ అని తెలిసిన త‌ర్వాత‌.. జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ మ‌ధ్య సీన్స్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటాయ‌ని ఆశిస్తారు ప్రేక్ష‌కులు. ఎత్త‌కు పై ఎత్తు వేస్తూ వెళ్తుందేమో అనుకుంటారు. కానీ ఇవి ఏ కోశానా క‌నిపించ‌వు. క్లైమాక్స్ కూడా సాదాసీదాగా ముగించాడు ద‌ర్శ‌కుడు. ఇమేజ్ కోసం ఎంత దూర‌మైనా వెళ్లే ఓ ద‌ర్శ‌కుడి క‌థే ఈ చిత్రం.. 

న‌టీన‌టులు: నారా రోహిత్ కొత్త‌గా ట్రై చేసాడు. నిజంగానే ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన సినిమాల కంటే ఇది కొత్త‌ది. ఎందుకంటే విల‌న్ రోల్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు ఈ హీరో. జ‌గ‌ప‌తిబాబు లాయ‌ర్ గా బాగానే చేసినా.. ఇదివ‌ర‌కే ఇలాంటి పాత్ర‌లు చాలా చేసాడు ఈయ‌న‌. లాయ‌ర్ కాదు.. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్. ద‌ర్శిక భాన‌త్ ప‌ర్లేదు. ఈమెకు క‌థ‌తో పెద్ద‌గా ప‌ని ప‌డ‌లేదు. ఇక బ్ర‌హ్మానందం ఇక‌పై సినిమాలు చేయ‌కుండా ఉంటేనే బెట‌ర్ ఏమో..? ఎందుకంటే ఈయ‌న కామెడీ నవ్వించ‌క‌పోగా విసిగిస్తుంది. మిగిలిన వాళ్లంతా ఓకే.. 

టెక్నిక‌ల్ టీం: సాయికార్తిక్ సంగీతం సాదాసీదాగా ఉంది. పైగా ఆర్ఆర్ మొత్తంగా బిగ్ బాస్ మ్యూజిక్ ఎత్తేసి కొట్ట‌డం ఆశ్చ‌ర్యం. ఎవ‌రూ అడ‌గ‌ట్లేదో ఏమో కానీ సినిమా అంతా అదే చేసాడు సాయికార్తిక్. ఇక విజ‌య్ సి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఎడిటింగ్ చాలా వీక్. చాలా సీన్స్ స‌హ‌నానికి ప‌రీక్ష పెడతాయి. ద‌ర్శ‌కుడిగా ప‌రుచూరి ముర‌ళి మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. క‌థ ప‌క్కాగానే రాసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే మాత్రం గాలికి వ‌దిలేసాడు. 

చివ‌ర‌గా: ఈ ఆట‌గాళ్లు ఆడ‌కున్నారు.. బాక్సాఫీస్ తో కాదు.. ప్రేక్ష‌కుల‌తో..!

రేటింగ్: 2/5 

More Related Stories