English   

అర్జున్ రెడ్డికి ఏడాది.. అంత గొప్పేంటి..? 

arjun-reddy
2018-08-25 14:28:47

ఆగ‌స్ట్ 25.. 2017 ఓ సంచ‌ల‌నం. ఆ రోజు విడుద‌లైన ఓ సినిమా 85 ఏళ్ల తెలుగు ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లో ఓ పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచిపోయింది. ఎన్నో సినిమాలు వ‌చ్చినా కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన పేజీని సృష్టించింది. అదే అర్జున్ రెడ్డి. ఇన్ని ద‌శాబ్దాల్లో ఎన్నో గొప్ప సినిమాలు వ‌చ్చాయి.. వాట‌న్నింటినీ దాటి పాత్ బ్రేకింగ్ మూవీ అనాలంటే ఎంతో గొప్పత‌నం ఉండాలి.. అందులో ఎన్నో విశేషాలు ఉండాలి.. అన్ని చెబుతున్నారంటే ఆ చిత్రం క‌చ్చితంగా చ‌రిత్ర సృష్టించేది అయ్యుండాలి. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా గురించి అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. శివ త‌ర్వాత టాలీవుడ్ ను మార్చేసిన సినిమా అని కొంద‌రు అంటుంటే.. తెలుగు సినిమాను మార్చేసిన సినిమా మ‌రికొంద‌రు అంటున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న ఈ చిత్రాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిపోయింది. 

తెలుగు సినిమాల్లో లిప్ లాక్ సీన్లు.. హాట్ సీన్లు.. బోల్డ్ డైలాగులు చూడ‌లేదు. బృందావ‌న కాల‌నీ లాంటి సినిమాల్లో కాస్త చూపిస్తేనే అబ్బో అద్భుతం అనుకున్నారంతా. అలాంటిది ఇప్పుడు అర్జున్ రెడ్డిలో దానికి ప‌దింత‌లు చూపించాడు ద‌ర్శ‌కుడు సందీప్. దాంతో మ‌న ప్రేక్ష‌కుల‌కు అర్జున్ రెడ్డి అద్భుతం అనిపిస్తుంది. పైగా లిప్ లాక్ సీన్లు.. హాట్ సీన్లు అనేవి నిత్యం మ‌న జీవితంలో ఉంటాయి క‌దా.. వాటిని తెర‌పై చూపిస్తే త‌ప్పేంటి అంటున్నారు. దీనికి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి కూడా కావాల్సినంత స‌పోర్ట్ వ‌స్తుంది. 

అప్ప‌టి వ‌ర‌కు మూస‌లో ఉన్న ఇండ‌స్ట్రీకి బ‌య‌టికి తీసుకొచ్చిన ఘ‌న‌త అయితే క‌చ్చితంగా అర్జున్ రెడ్డికి ఇవ్వాల్సిందే. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను ఈ చిత్రంతో చూపించాడు సందీప్ రెడ్డి. కాక‌పోతే అది కాస్త ప‌చ్చిగా చూపించే ప్ర‌య‌త్నం చేసాడు. ఏడాది గడిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి ఊహ‌ల్లో ఉన్నారు ప్రేక్ష‌కులు. ఆ హ్యాంగోవ‌ర్ ఇంకా వ‌ద‌ల‌డం లేదు. రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడు కూడా ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో పొగిడేసాడు. కేవ‌లం మూడు కోట్ల‌తో తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి 27 కోట్ల షేర్ తో పాటు రీమేక్, శాటిలైట్ రైట్స్ కింద మ‌రో 10 కోట్ల‌కు పైగానే ఆర్జించి పెట్టింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో షాహిద్ క‌పూర్ తో రీమేక్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి. త‌మిళ‌నాట విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బాల ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తుండ‌టం విశేషం. మొత్తానికి ఎన్నాళ్లైనా.. ఎన్నేళ్లైనా అర్జున్ రెడ్డి హ్యాంగోవ‌ర్ మాత్రం అలాగే ఉండిపోతుంది. 

More Related Stories