English   

వినాయ‌క్ ను టార్గెట్ చేసిన శంక‌ర్.. 

Robo-teaser
2018-08-25 16:09:52

శంక‌ర్ ఏంటి.. వినాయ‌క్ ను టార్గెట్ చేయ‌డం ఏంటి..? అస‌లు ఇప్పుడు వినాయ‌క్ ఏం చేసాడు అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డ వినాయ‌క్ అనేది మాత్ర‌మే నిజం.. ఆయ‌న ద‌ర్శ‌కుడు అనుకోవ‌డం మ‌న ఊహ‌. వినాయ‌క్ అంటే వినాయ‌కుడు.. ఆ గ‌ణేషుడు. ఇప్పుడు ఈయ‌న్నే ల‌క్ష్యంగా చేసుకుని వ‌స్తున్నాడు శంక‌ర్. సెప్టెంబ‌ర్ 13న 2.0 టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు శంక‌ర్. అయినా ద‌ర్శ‌కుడు శంక‌ర్ కు పెద్ద‌గా కోరిక‌లు ఏం లేవు.. ఆయ‌న అనుకున్న సినిమాను అనుకున్న స‌మ‌యానికి ఒక్క‌సారైనా విడుద‌ల చేయాల‌ని 30 ఏళ్ల కెరీర్ లో ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అది నెర‌వేర‌లేదు. ప్ర‌తీ సినిమాకు ఏదో ఓ స‌మ‌స్య‌తో వెన‌క్కి వెళ్ల‌డం ఈయ‌న‌కు అల‌వాటుగా మారిపోయింది. ఇప్పుడు అది ఇంకా పీక్స్ కు చేరిపోయింది. ఎంత‌లా అంటే చెప్పిన సినిమాను ఏడాది పాటు కూడా ఆల‌స్యం చేసేవ‌ర‌కు వెళ్లింది ఈ వ్య‌వ‌హారం. ఇప్పుడు 2.0 సినిమాది కూడా ఇదే ప‌రిస్థితి. 

సినిమా సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం టీజ‌ర్ కూడా చెప్పిన టైమ్ కు విడుద‌ల చేయ‌డం లేదు శంక‌ర్. ఆయ‌న ఎలాగూ విడుద‌ల చేయ‌డ‌ని.. ఈ మ‌ధ్యే లీకు వీరులు టీజ‌ర్ ను విడుద‌ల చేసారు. మిగిలిన ద‌ర్శ‌కులైతే టీజ‌ర్ ఎలాగూ లీక్ అయింది క‌దా అని దాన్నే అఫీషియ‌ల్ గా విడుద‌ల చేస్తారు. కానీ అక్క‌డున్న‌ది శంక‌ర్.. అలా చేస్తే ఆయ‌న శంక‌ర్ ఎందుకు అవుతాడు..? అందుకే ఇప్పుడు చిత్ర‌యూనిట్ కు పిచ్చెక్కించే షాక్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. టీజ‌ర్ ఎలాగూ వ‌చ్చింది క‌దా.. పాత టీజ‌ర్ నే విడుద‌ల చేద్దాం అంటే వ‌ద్దు చూసిన టీజ‌ర్ వ‌స్తే నేను ఒప్పుకోనంటూ కొత్త టీజ‌ర్ సిద్ధం చేయిస్తున్నాడు శంక‌ర్. ఈ టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 13న రానుంద‌ని తెలుస్తుంది. అయితే దీనిపై కూడా ఇంకా అఫీషియ‌ల్ గా ఏం చెప్ప‌లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే టీజ‌ర్ విష‌యం ప‌క్క‌న‌బెడితే సినిమా మాత్రం క‌చ్చితంగా న‌వంబ‌ర్ 29న విడుద‌ల అవుతుందంటున్నాడు శంక‌ర్. మ‌రి ఈ మాటైనా నిల‌బెట్టుకుంటాడో లేదో చూడాలి..!

More Related Stories