English   

తెలుగు సినిమాల్లో ర‌క్షాబంధ‌న్..

raksha-bandhan-Tollywood
2018-08-26 09:48:36

ర‌క్షాబంధ‌న్.. ఓ అన్న చెల్లికి.. త‌మ్ముడు అక్క‌కు ఇచ్చే భ‌రోసా.. ప్రేమ‌.. ఆప్యాయ‌త‌.. అనురాగం.. ఆత్మీయ‌త‌.. ఇలా ఒక్క పండ‌గ‌లో ఎన్నో ఉంటాయి. రాఖీ పండ‌గ వెన‌క ఎన్నో క‌థ‌లు ఉంటాయి. నాటి కృష్ణుడి యుగం నుంచి నేటి వ‌ర‌కు ఎన్నో క‌థ‌లు రాఖీ స్పెష‌ల్ గా చెప్పుకుంటారు. అయితే ఎవ‌రెలా చెప్పినా.. ఎంత చెప్పుకున్నా.. రక్షాబంధ‌న్ వ‌చ్చిందంటే ఇంట్లో ఉండే సంద‌డి వేరుగా ఉంటుంది. ఇక తెలుగు సినిమాల్లో కూడా ఈ సంద‌డి మామూలుగా ఉండ‌దు. మ‌న ద‌గ్గ‌ర అన్నాచెల్లి సెంటిమెంట్ సినిమాలు చాలానే వ‌చ్చాయి. ఇక్క‌డ సిస్ట్ట‌ర్ సెంటిమెంట్ చేయ‌ని హీరో లేడు. ఎన్టీఆర్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న‌పుడు సావిత్రిని చెల్లిగా తీసుకుని వి.మ‌ధుసూధ‌న‌రావ్ ర‌క్త‌సంబంధం సినిమా చేసాడు. ఈ చిత్రం ఇప్ప‌టికీ నిత్య నూత‌న‌మే. చిట్టిచెల్లెలు లాంటి సినిమాలు కూడా ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్ప‌టికీ మిగిలిపోయాయి. 

ఏఎన్నార్ కూడా దొంగ‌రాముడుతో పాటు బంగారు గాజులు లాంటి సిస్ట‌ర్ సెంటిమెంట్ సినిమాలు చేసాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు అప్ప‌ట్లో జ‌గ్గ‌య్య లాంటి హీరోలు కూడా అప్పుడ‌ప్పుడూ చెల్లి సెంటిమెంట్ తో సినిమాలు చేసారు. కృష్ణ ఒక్క‌డే ఎందుకో కానీ ఈ త‌ర‌హా సినిమాల‌కు కాస్త దూరంగా ఉన్నాడు. కానీ శోభ‌న్ బాబు అప్ప‌ట్లో చేసిన ఓ సినిమా సంచ‌ల‌నం అయింది. అదే జీవ‌న‌రాగం. సుమ‌లత ఇందులో శోభ‌న్ బాబుకు చెల్లి. క‌న్నీరు పెట్టించే ఎమోష‌న్ ఈ క‌థ‌లో ఉంటుంది. క‌ర్క‌శంగా క‌నిపించే కృష్ణంరాజు చెల్లి సెంటిమెంట్ సినిమాలు చేసాడు. 

చిరంజీవి హిట్ల‌ర్.. అల్లుడా మ‌జాకా.. లంకేశ్వ‌రుడు లాంటి సినిమాల్లో చెల్లి సెంటిమెంట్ ను బాగానే పండించాడు. బాల‌య్య అయితే ముద్దుల మావ‌య్య‌తో ఇండ‌స్ట్రీ రికార్డులే తిర‌గ‌రాసాడు. దానికితోడు రాణా.. స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాల్లోనూ సిస్ట‌ర్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయింది. నాగార్జున ఆజాద్.. వెంక‌టేశ్ వాసుతో పాటు గ‌ణేష్ లాంటి సినిమాల్లో చెల్లెలు సెంటిమెంట్ పండించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌వ‌రం.. తొలిప్రేమ‌.. మ‌హేశ్ అర్జున్.. ఒక్క‌డు.. ప్ర‌భాస్ డార్లింగ్.. చ‌ర‌ణ్ బ్రూస్లీ.. ఎన్టీఆర్ రాఖీ.. రాజ‌శేఖ‌ర్ గోరింటాకు.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ పుట్టింటికి రా చెల్లి.. జ‌గ‌ప‌తిబాబు శివ‌రామ‌రాజు లాంటి సినిమాలు అన్నీ చెల్లి సెంటిమెంట్ తో వ‌చ్చిన‌వే. అందుకే తెలుగు ఇండ‌స్ట్రీకి ర‌క్షాబంధ‌న్ కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. ఈ రాఖీ పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌తీ అన్నాచెల్లి.. అక్కా త‌మ్ముడికి సినిమాపాలిటిక్స్.కామ్ త‌ర‌ఫున కూడా ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు.  

More Related Stories