English   

నాగార్జున‌ కూడా ఒడిదుడుకులు చూసాడు

Akkineni Nagarjuna Career up and Downs Birthday Special
2018-08-29 07:23:07

వ‌య‌సు 50 దాటితే అంకుల్ అంటారు.. 60కి చేరువైతే తాత అంటారు. కానీ నాగార్జున‌కు ఈ రెండు సూట్ కావు. ఇప్ప‌టికీ ఆయ‌న న‌వ మ‌న్మ‌థుడే. ఆయ‌న వ‌యసు 60 కి ఒక్క‌టే ఏడాది త‌క్కువ‌గా ఉందంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. ఇప్ప‌టికీ కుర్ర హీరోలు ఆయ‌న్ని చూసి కుళ్ళుకుంటారు. గ్లామ‌ర్ సీక్రేట్ తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటారు. అస‌లు 59 ఏళ్ల‌కు ఈ స్థాయిలో అందాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో తెలియ‌క అంతా షాక్ అయిపోతున్నారు. ఇప్పుడు దేవ‌దాస్ స్టిల్స్ చూస్తుంటే నిజంగా నాగార్జున‌కు 59 ఏళ్లంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. నాగ్ మ‌రో ఏడాది పెరిగిపోయాడు. ఇప్పుడు ఈయ‌న వ‌య‌సు 59. ఇంకా ఒక్క ఏడాది ఆగితే ష‌ష్టిపూర్తి వ‌య‌సు కూడా. కానీ ఇప్ప‌టికీ కుర్ర హీరోలు కూడా కుళ్లు కునే గ్లామ‌ర్ ఈయ‌న సొంతం.

1959లో జ‌న్మించిన నాగార్జున‌.. 1986లో హీరో సినిమాకు రీమేక్ గా విక్ర‌మ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు నాగార్జున‌. అక్కినేని వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా కూడా కెరీర్ మొద‌ట్లో చాలా ఎదురు దెబ్బ‌లు తిన్నాడు నాగార్జున‌. సొంత ఇమేజ్ కోసం చాలా ప్ర‌య‌త్నించాడు. ఓ సంద‌ర్భంలో నాగార్జున వార‌సుడిగా ఫెయిల్ అవుతున్నాడా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి ప్రేక్ష‌కుల్లో. కానీ అలాంటి టైమ్ లో వ‌చ్చిన మ‌జ్ను.. క‌లెక్ట‌ర్ గారి అబ్బాయి.. ఆఖ‌రిపోరాటం లాంటి సినిమాలు నాగార్జున‌కు విజ‌యాల‌ను తీసుకొచ్చాయి. అయితే నాగార్జున‌కు స్టార్ డ‌మ్ తీసుకొచ్చిన సినిమా మాత్రం శివ‌.


1989లో వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రం త‌ర్వాత అదే ఏడాది గీతాంజ‌లితో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు నాగార్జున‌. అప్ప‌టి నుంచి వ‌ర‌స‌గా 14 ఫ్లాపులు ఇచ్చిన ఈ హీరో.. అల్ల‌రి అల్లుడుతో మ‌ళ్లీ క‌మ్ బ్యాక్ అయ్యాడు. హ‌లో బ్ర‌ద‌ర్.. ఘ‌రానా బుల్లోడు.. ఆవిడా మా ఆవిడే.. అన్న‌మ‌య్య‌.. నిన్నే పెళ్లాడ‌తా.. నిన్నే ప్రేమిస్తా.. నువ్వు వ‌స్తావ‌ని.. మ‌న్మ‌థుడు.. నేనున్నాను.. మాస్.. సంతోషం.. కింగ్.. సోగ్గాడే చిన్నినాయ‌నా.. మ‌నం.. ఇలా ఎన్నో విజ‌యాల‌తో స్టార్ అయ్యాడు.

నాగార్జున చేసిన‌న్ని ప్ర‌యోగాలు తెలుగులో మ‌రే హీరో చేయ‌లేదు. కొత్త ద‌ర్శ‌కుల‌ను న‌మ్మ‌డంలో కూడా ఈయ‌న దిట్ట‌. క‌థ‌లోని క‌సి ఇట్టే క‌నిపెట్టి క‌నిక‌ట్టు చేస్తాడు మ‌న్మ‌థుడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వెలిగిపోతున్న చాలా మంది ద‌ర్శ‌కులు అన్న‌పూర్ణ‌లోనే సినిమా ఓన‌మాలు దిద్దారు. ఇప్పుడు కూడా కుర్ర ద‌ర్శ‌కుల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నాడు నాగార్జున‌. విడుద‌ల‌కు సిద్ధ‌మైన దేవ‌దాస్ కూడా శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు నాగార్జున‌. నాని ఇందులో మ‌రో హీరో. తాజాగా విడుద‌లైన ఈ స్టిల్స్ ఈయ‌న వ‌య‌సును మ‌రిచిపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి పుట్టిన‌రోజులు నాగార్జున మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆశిస్తూ సినిమాపాలిటిక్స్.కామ్ త‌ర‌ఫు నుంచి నాగార్జున‌కు హ్యాపీ బ‌ర్త్ డే.

More Related Stories