English   

సీత‌య్య ఇక‌లేరు.. దేవుడి మాట విన్నారు..

Harikrishna-died
2018-08-29 02:33:20

హ‌రికృష్ణ అన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది సీత‌య్య‌.. ఎవ‌రి మాటా విన‌డు అంటూ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాడు ఈయ‌న. అయితే ఈయ‌న ఇన్నాళ్లూ ఎవ‌రి మాటా విన‌లేదు కానీ ఇప్పుడు మాత్రం దేవుడి మాట విన్నారు. రోడ్డు ప్ర‌మాదంలో ఈయ‌న దుర్మ‌ర‌ణం ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు టీడిపి వ‌ర్గాల్లోనూ శోకం మిగిల్చింది. నిన్న‌టి వ‌ర‌కు అంద‌రితోనూ క‌లిసి మెలిసి ఉన్న హ‌రికృష్ణ‌.. ఇప్పుడు విగ‌త‌జీవిగా ప‌డి ఉండ‌టం చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారు అభిమానులు. నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ జ‌న్మించారు. ఆయ‌న పుట్టిన‌రోజు మ‌రో మూడు రోజుల్లోనే రానుంది. 

అంత‌లోనే ఆగ‌స్ట్ 29న ఆయ‌న రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూయ‌డం నిజంగా శోచ‌నీయం. సెప్టెంబరు 2, 1956న ఆయ‌న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చిన్న‌ప్ప‌ట్నుంచే తండ్రిని చూసి అన్న‌గారి మాదిరే ఉండ‌టం అల‌వాటుగా మార్చుకున్నారు హ‌రికృష్ణ‌. 1967లో శ్రీకృష్ణావతారం సినిమాతో బాల‌న‌టుడిగా వ‌చ్చారు. త‌ర్వాత మ‌రో రెండు సినిమాల్ల‌నూ బాల న‌టుడిగా చేసారు ఈయ‌న‌. ఆ త‌ర్వాత తల్లా పెళ్లామా.. రామ్‌ రహీమ్‌.. దాన వీర శూర కర్ణ లాంటి సినిమాల్లో మొద‌ట్లో న‌టించారు. ఆ త‌ర్వాత తండ్రి రాజ‌కీయాల్లోకి రావ‌డంతో పూర్తిగా ఆయ‌న‌తోనే ఉండిపోయాడు హ‌రికృష్ణ‌. ప‌దేళ్ల పాటు అన్నీ వ‌దిలేసుకుని నాన్న‌తోనే ఉన్నాడు. 

ఆ త‌ర్వాత మ‌ళ్లీ శ్రీరాములయ్యతో 1998లో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. అప్ప‌ట్నుంచీ వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ వ‌చ్చారు. వైవిఎస్ చౌద‌రి తెర‌కెక్కించిన సీతారామ‌రాజు.. లాహిరి లాహిరి లాహిరిలో.. సీత‌య్య సినిమాలు సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. ఇక జ‌గ‌ప‌తిబాబుతో శివరామరాజులో న‌టించారు హ‌రికృష్ణ‌. రైతుల కోసం చేసిన టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌.. సెంటిమెంట‌ల్ స్వామి.. కుటుంబ క‌థా చిత్రం శ్రావణమాసంలో న‌టించారు. 14 ఏళ్లుగా ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉన్నారు.

తండ్రి రాజకీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న జీవితం గురించి పూర్తిగా మ‌రిచిపోయారు హరికృష్ణ. త‌ను త‌న పిల్ల‌లు అనే విష‌యాన్ని ప‌క్క‌న‌బెట్టి ఎన్టీఆర్‌ ప్రచార వాహనం చైతన్య రథాన్ని ఆయ‌నే న‌డిపారు. ఆ త‌ర్వాత తండ్రి చ‌నిపోయాక రాజ‌కీయాల్లో కూడా కొన్నాళ్లు యాక్టివ్ గానే ఉన్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబుతో విభేధాలు వ‌చ్చిన త‌ర్వాత అన్న తెలుగుదేశం పెట్ట‌డం.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ దాన్ని మూసేయ‌డం ఇవ‌న్నీ హ‌రికృష్ణ రాజ‌కీయ జీవితంలో కీల‌క ఘ‌ట్టాలు. 

ఆయ‌న రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. చంద్ర‌బాబు హ‌యాంలో రవాణాశాఖా మంత్రిగా కూడా ప‌ని చేసారు హ‌రికృష్ణ‌. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ కొంతకాలంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగానే ఉన్నారు. కొడుకులు స్టార్ హీరోలుగా మారిన త‌ర్వాత హ‌రికృష్ణ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ మ‌ధ్య ఎక్కువ‌గా త‌న‌యుల సినిమా వేడుక‌ల్లోనే క‌నిపిస్తూ వ‌చ్చారు ఈయ‌న‌. 

More Related Stories