English   

హరికృష్ణ గురించి కొందరికి తెలిసిన నిజాలు

Harikrishna nandamuri has Rebellion person in total nandamuri family
2018-08-29 09:21:30

మొండిదనం.. ముక్కుసూటితత్వం.. ఎవర్నీ లెక్కచేయని తనం కలిస్తే హరికృష్ణ. మామూలుగానే ఆయనకు గుండె ధైర్యం ఎక్కువ. చిన్నప్పటి నుంచి కార్లన్నా.. డ్రైవింగ్ అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే అన్నగారి చైతన్యరథానికి సారథిగా మార్చింది. హరికృష్ణ డ్రైవింగ్ ఎక్స్ పర్ట్ అని ఆయన గురించి తెలిసిన అందరికీ తెలుసు. కానీ విధిరాతను ఎవరూ మార్చలేరు. మనం ఎక్స్ పర్ట్ అనుకున్న విషయం నుంచే మరణం వచ్చిన ఎందర్నో చూశాం. ఇప్పుడు హరికృష్ణ. నందమూరి వంశంలో డైనమిజానికి పెట్టింది పేరైన హరికృష్ణ మరణం ఆ కుటుంబానికే కాదు.. అభిమానులకూ తీరని శోకాన్ని మిగిల్చింది. 
 
హరికృష్ణ అంటే నందమూరి తారకరామారావుకు చాలా ఇష్టం.  మొదట్లో హరికృష్ణను తన నట వారసుడిగా చేయాలనుకున్నారు ఎన్టీఆర్. సీతారామకళ్యాణం సినిమాతో బాలనటుడుగా పరిచయం చేశారు. కానీ అప్పటికే పార్టీ పెట్టాలన్న ఆలోచన రావడంతో పాటు హరి కంటే బాలకృష్ణ కాస్త మెరుగ్గా కనిపించడంతో హరిని నటుడుగా కంటే తన వద్ద ఎక్కువగా ఉంచుకున్నారు. అయినా తొలినాళ్లలో ఈ తనయులిద్దరితో తల్లా పెళ్లామా, తాతమ్మ కల, రామ్ రహీమ్ వంటి సినిమాల్లో నటింపచేశారు. హరికృష్ణ ముందు నుంచీ చురుకైన మనిషి. ఏం చెప్పినా వెంటనే అల్లుకుపోయే తత్వం అనే పేరుంది. ఇదే అన్నగారు పార్టీ పెట్టినప్పుడు తనే స్వయంగా ఓ చైతన్య రథం తయారు చేయించి దానికి తనే సారథిగా మారారు. వేల కిలోమీటర్లు ఒంటరిగా డ్రైవింగ్ చేసి ఆ చైతన్య రథం నుంచే తండ్రిని అసెంబ్లీకి పంపించారు. ఈ క్రమంలో హరికృష్ణ తండ్రికి కుడిభుజంగా వ్యవహరించారు. నమ్మినవారి కోసం ఏం చేయడానికైనా వెనకాడని తత్వం హరికృష్ణది. రాజకీయాల్లో తండ్రి స్థానాన్ని అందుకోలేకపోయినా.. ఆ తర్వాత ఆయన తత్వాన్ని పుణికిపుచ్చుకుని అనేకసార్లు ఎవరికీ భయపడకుండా తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా వెల్లడించారు. మధ్యలో అన్న టిడిపి అనే పార్టీని స్థాపించినా.. దాన్నీ కొనసాగించలేకపోయారు. తర్వాత మరో పార్టీ వైపు చూడకుండా తండ్రి పార్టీలోనే కొనసాగుతూ.. ఆ అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేశారు..
 
హరికృష్ణ రెబలిజానికి పెట్టింది పేరు. ఇదే దర్శకుడు శంకర్ కు నచ్చింది. అందుకే దశాబ్ధాల తర్వాత మరోసారి హరికృష్ణను వెండితెరపై చూపించే ప్రయత్నానికి కారణమైంది. అప్పటికే శ్రీరాములయ్య గురించి తెలిసి ఉండటం. పరిటాల రవి, మోహన్ బాబుతో స్నేహం.. అన్నీ కలిసి మరోసారి ఆయన్ని నటుడుగా మేకప్ వేసుకునేలా చేశాయి. శ్రీరాములయ్యలో వెంపటాపు సత్యం అనే నక్సలైట్ పాత్రలో అచ్చంగా ఒదిగిపోయారు. శ్రీరాములయ్యకు రాజకీయ గురువుగా ఇది హరికృష్ణ లైఫ్ లో తిరుగులేని పాత్ర. నటన తమ రక్తంలో ఉందని నమ్ముతుంది నందమూరి వంశం. అందుకే మొహమాటానికి చేసిన శ్రీరాములయ్యలోని పాత్ర ఎందరికో నచ్చింది. దీంతో ఆఫర్స్ వెల్లువెత్తాయి. మొహమాటం నుంచి తప్పక నటించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కొంతకాలం పాటు వెండితెరపై తనదైన శైలిలో అద్భుతంగా రాణించారు. హరికృష్ణ అత్యంత చురుకైన మనిషి. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహిస్తారు. ఇది నటనలోకి వచ్చాక మరింత ఉపయోగపడింది. అందుకే ఆయన్నే ప్రధాన పాత్రలుగా మలచుకుని కథలకు పదునుపెట్టారు దర్శకులు. ఈ క్రమంలో వచ్చిన లాహిరిలాహిరిలాహిరిలో సినిమాలోని ఆయన పాత్ర ఎవర్ గ్రీన్. అగ్రెసివ్ గా ఉండే ఆ పాత్రలో హరికృష్ణను తప్ప మరెవరినీ ఊహించుకునే ఛాన్స్ ఇవ్వలేదాయన. తర్వాత శివరామరాజు అనే సినిమాలో అనందభూపతి రాజు అనే గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ పాత్ర ఉన్నంత సేపూ వెండితెర దద్దరిల్లిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో తన ఇంపాక్ట్ చూపించాడు హరికృష్ణ.

నిజానికి ఆయన వయసులో నటులైన చాలామందికి దక్కని ఆదరణ ఆయనకు దక్కింది. అది కూడా మాస్ నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ప్రధానమైన పవర్ ఫుల్ రోల్స్ తో ఆకట్టుకుంటోన్న హరికృష్ణలో హీరోను చూశాడు దర్శకుడు వైవియస్ చౌదరి. అప్పటికే ఆయనతో లాహిర లాహిరి లాహిరిలో చేసి ఉండటం కూడా ఇందుకు కారణం కావొచ్చు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సీతయ్య సినిమా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో నిటారుగా నించుని ఓ కాలును పూర్తిగా పైకి ఎత్తుతాడు హరికృష్ణ. అప్పట్లో అనేక పోస్టర్స్ లో కనిపించేది. కానీ ఇదంతా గ్రాఫిక్.. ఈ వయసులో ఆయనిలా చేయలేడు అన్నారు. కానీ మీడియా ముందు మరోసారి అలా చేసి నందమూరి బిడ్డా మజాకా అనిపించాడు. సీతయ్య ఎవరి మాటా వినడు అనే క్యాప్షన్ తో అత్యంత పవర్ ఫుల్ పాత్రలో రౌద్ర రౌసాన్ని అద్భుతంగా పండించిన హరికృష్ణ.. ఇదే సినిమాలో సిమ్రన్ తో కలిసి వేసిన స్టెప్పులు ఆంధ్రదేశాన్ని ఊపేశాయి. ఇక సౌందర్యతో కలిసి ఉండే ఎపిసోడ్ లో కరుణ రసాన్నీ పలికిస్తారు. తర్వాత నటుడుగా కొనసాగేందుకే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రైతుల కోసం పాటుపడే నాయకుడిగా టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో కనిపిస్తారు. తర్వాత చెల్లెల్ల కోసం ఆరాటపడే అన్నగా స్వామి సినిమాలో కనిపిస్తారు. ఈ రెండు సినిమాల్లోని పాత్రలూ.. అప్పటి వరకూ ఆయన చేసిన పాత్రలకు భిన్నమైనవి. హరికృష్ణ ఆహార్యాన్ని చూస్తే ఆయన్ని సాత్విక పాత్రల్లో చూడలేం. అందుకే టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలు విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి తొలిసారిగా దర్శకత్వం వహించిన శ్రావణ మాసం సినిమాలో మరోసారి తనదైన రెబలిజం నిండిన పాత్రలో ఆకట్టుకుంటారు.. 
 
హరికృష్ణ.. నందమూరి తారకరామారావు తనయుల్లో విశిష్టమైన వ్యక్తి. ఎవరికీ తలవంచని నైజం.. రెబలిజం ఆయనకి పెట్టని ఆభరణాలు. ఇవి హరికృష్ణకు వ్యక్తిగతంగానూ ఎందరో అభిమానుల్ని తెచ్చింది. ఇప్పుడు కూడా ఓ అభిమాని తనయుడి పెళ్లికి వెళుతూనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తనకు నచ్చింది చేయడం కోసం ఎవరికీ వంచని ఆ తల విధిరాతకు వంచక తప్పలేదు. ఎవరి మాటా వినని సీతయ్యకు దేవుడి మాట వినక తప్పలేదు. ఇప్పటికే ఇంటికి పెద్ద కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు ఇంటిపెద్దనూ కోల్పోయింది. పెద్ద కొడుకు జానకిరామ్ చనిపోయినప్పుడు హరికృష్ణ తీవ్రంగా కుంగిపోయారు. తనకు గుండె లాంటి పెద్ద కొడుకు వెళ్లిపోయినా రెండు కళ్లలాంటి కొడుకులున్నారని సంభాళించుకున్న ఆయన ఇలా హఠాత్తుగా మరణించడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.   తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నా.. రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించినా.. వెండితెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినా.. అది హరికృష్ణకే చెల్లింది. మరణం ఎవరికీ అతీతం కాదు. కానీ అది అనూహ్యంగా రావడం మాత్రం అందరినీ బాధించే విషయం. ఈ విషయంలో హరికృష్ణ కుటుంబానికి వచ్చిన శోకం మరెవరికీ రాకూడనిది.

More Related Stories